సైకో శ్రీనివాసరెడ్డి మరో కోణం : వేములవాడ అమ్మాయితో ప్రేమ

హాజీపూర్‌లో వరుస అత్యాచారాలు, హత్యలు చేసిన సైకో శ్రీనివాసరెడ్డికి సంబంధించిన మరో కోణాన్ని పోలీసులు బయటపెట్టారు. తాను కన్నేసిన వారిపై అత్యాచారం చేసి చంపేసే లక్షణమున్న శ్రీనివాసరెడ్డి ఒక అమ్మాయి విషయంలో మాత్రం సున్నితంగా వ్యవహరించాడు. వేములవాడకు చెందిన ఈ అమ్మాయిని ప్రేమించాడని.. పెళ్లి కూడా చేసుకుందామని అనుకోవడం వల్లే తనని ఏం చేయకుండా వదిలేశాడని పోలీసులు చెబుతున్నారు.

దారుణ హత్యల ఉదంతం బయటపడిన తర్వాత శ్రీనివాసరెడ్డి జీవితాన్ని పలు కోణాల్లో ఆరా తీశారు. ఈ క్రమంలో అతను ఒక అమ్మాయితో తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఈ అమ్మాయి గురించి ఆరా తీయగా ఆమె వేములవాడకు చెందినదని తెలిసింది.

ఒక సారి వేములవాడ దర్శనానికి వెళ్లినప్పుడు అక్కడ ఆ అమ్మాయి పరిచయమైంది. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పినప్పుడు ఆమె కూడా సానుకూలంగా స్పందించింది. ఆమె విషయంలో మాత్రం అతను చాలా సున్నితంగా వ్యవహరించాడని.. ఆమెపై తన వికృత రూపాన్ని ఏనాడూ ప్రదర్శించలేదని తెలిసింది.

గతంలో ఒక వివాహిత వద్ద తన కోరికను వెళ్లడించినప్పుడు ఆమె ఎదురుతిరిగి గ్రామస్తులు, కుటుంబీకులతో కొట్టించింది. అప్పటి నుంచి తన కోరికను వెలిబుచ్చినప్పుడు తిరస్కరిస్తే వాళ్లను కొట్టి చంపేవాడు. ఈ క్రమంలోనే మైనర్ బాలికలు, డిగ్రీ విద్యార్థిని హత్యలు జరిగాయి.

అయితే, వేములవాడ అమ్మాయి సానుకూలంగా స్పందించడం వల్లే ఆమెను ఏమీ చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. ఆమె ఇతనితో సన్నిహితంగా ఉండటం వల్లే ప్రాణాలు కాపాడుకోగలిగిందని పోలీసులు అంటున్నారు. ఆ యువతికి కూడా శ్రీనివాసరెడ్డి అసలు రూపం తెలియకపోవడంతోనే ప్రేమ వ్యవహారం నడిపిందని తెలుస్తోంది.