సాహో రీషూట్లు.. రిలీజ్ పై అనిశ్చితి

ఇప్పటికే సినిమాకు 200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. మరోవైపు ఆగస్ట్ 15న థియేటర్లలోకి రాబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఇంతలోనే సాహో యూనిట్ లో చిన్న అభిప్రాయబేధాలు తలెత్తాయి. అది కూడా హీరో ప్రభాస్ తో కావడం బాధాకరం. అవును.. సాహో సినిమాకు సంబంధించి ప్రభాస్ కు కొన్ని మేకింగ్ షాట్స్ నచ్చలేదు. వాటిని మళ్లీ తీయాలని డిమాండ్ చేస్తున్నాడట.

ప్రభాస్ చెప్పినట్టు చేయడానికి మేకర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. కానీ ఆల్రెడీ గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మళ్లీ రీషూట్ పెట్టుకుంటే ఇండస్ట్రీ దాన్ని అశుభంగా బావిస్తుంది. పైగా ప్రభాస్ చెప్పినట్టు మరోసారి సెట్స్ పైకి వెళ్తే, ఆగస్ట్ 15కు రావడం అసంభవం. అందుకే ఈ విషయంపై నిర్మాతలు, ప్రభాస్ మధ్య చిన్నపాటి చర్చ జరుగుతోంది.

నిజానికి సుజీత్ తీసిన కొన్ని షాట్స్ నిర్మాతలకు కూడా నచ్చలేదు. అవే ప్రభాస్ కు కూడా నచ్చలేదట. అలా అని మళ్లీ వెనక్కు వెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్నంతలో గ్రాఫిక్స్ జోడించి వాటినే మేనేజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ తప్పుపట్టిన సన్నివేశాల్లో దుబాయ్ షూటింగ్ విజువల్స్ కూడా ఉన్నాయట. మరోసారి ఆ షెడ్యూల్ అంటే యూనిట్ గుండె ఆగిపోవడం గ్యారెంటీ. ఎందుకంటే అది చాలా భారీ షెడ్యూల్. ఆ ఒక్క షెడ్యూల్ కోసమే 75 కోట్లు ఖర్చుచేశారు. అదే షెడ్యూల్ ను మళ్లీ చేయాలంటే చాలా కష్టం. ప్రస్తుతం అంతా కలిసి ప్రభాస్ ను ఒప్పించే పనిలో ఉన్నారట.