తెలంగాణా మేరీ కోమ్ నిఖత్ జరీన్….

  • నిజామాబాద్ నుంచి అంతర్జాతీయస్థాయికి
  • అరకొర సదుపాయాల నడుమే బాక్సింగ్
  • ఆసియా బాక్సింగ్ లో కాంస్యం

మనదేశంలో మహిళా బాక్సింగ్ అనగానే…మణిపూర్ మెరుపుతీగలు మేరీ కోమ్, సరితా దేవీ లాంటి బాక్సర్లు మాత్రమే గుర్తుకు వస్తారు. అయితే….తెలుగు రాష్ట్రాలు…ప్రధానంగా తెలంగాణా రాష్టానికి చెందిన యువబాక్సర్ నిఖత్ జరీన్ సంచలన విజయాలతో…. ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ కే సవాలు విసిరే స్థాయికి ఎదిగింది.

 ఒలింపిక్స్ మహిళల విభాగంలో భారత్ కు పతకం అందించిన క్రీడ బాక్సింగ్. భారత్ లో మహిళా బాక్సింగ్ అనగానే ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ కు చెందిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, సరితా దేవీ మాత్రమే ముందుగా గుర్తుకు వస్తారు. అయితే ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే కాదు…దక్షిణాది రాష్ట్రాలు సైతం మహిళా బాక్సర్లను అందించగలవని తెలంగాణా రాష్ట్రం చాటి చెప్పింది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల నిఖత్ జరీన్…గత ఐదేళ్లుగా భారత జూనియర్, సీనియర్ బాక్సింగ్ విభాగాలలో నిలకడగా రాణిస్తూ వస్తోంది. గతంలోనే ప్రపంచ జూనియర్ టైటిల్ నెగ్గిన నిఖత్ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే స్థితికి ఎదిగింది.

తండ్రి ప్రేరణతో…..

బాక్సింగ్ లో అంతర్జాతీయ ప్రమాణాలు ఏమాత్రం లేని నిజామాబాద్ లాంటి ప్రాంతం నుంచి నిఖత్ జరీన్ భారత బాక్సింగ్ లోకి దూసుకువచ్చింది. తండ్రి ప్రేరణ, శిక్షణతో బాక్సింగ్ ఓనమాలు దిద్దుకోడమే కాదు..

జాతీయ సబ్ జూనియర్, జూనియర్ విభాగాలలో సైతం సత్తా చాటుకొంటూ జాతీయ బాక్సర్ గా గుర్తింపు సంపాదించింది. తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్ శిక్షణలో రాటు దేలింది.

అరకొర సదుపాయాలు, అంతంత మాత్రం ఆదరణతో బాక్సర్ గా తన కెరియర్ ను కొనసాగించిన నిఖత్ ఇప్పుడు ఏకంగా 2022 టోక్యో ఒలింపిక్స్ మహిళా బాక్సింగ్ బెర్త్ కే గురిపెట్టింది. 51 కిలోల విభాగంలో స్టార్ బాక్సర్ మేరీ కోమ్ తోనే పోటీపడే స్థాయికి ఎదిగింది.

బంగారు పతకంతో బోణీ…

బల్గేరియాలో ముగిసిన స్ట్రాంజా మెమోరియల్ అంతర్జాతీయ బాక్సింగ్ 51 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించడం ద్వారా నిఖత్ ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది.

ఆ తర్వాత బ్యాంకాక్ వేదికగా ముగిసిన 2019 ఆసియా మహిళల బాక్సింగ్ టోర్నీలో మాత్రం నిఖత్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తొలిరౌండ్లో రెండుసార్లు ఆసియా మాజీ చాంపియన్ , కజకిస్తాన్ బాక్సర్ నజ్యుమ్ కజ్ బే పై 5-0తో సంచలన విజయం సాధించడం ద్వారా సెమీఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

ఫైనల్లో చోటు కోసం వియత్నాం బాక్సర్ గుయెన్ థీ టామ్ తో…తుదివరకూ పోరాడి 2-3 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది.

ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా….

జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలలో నిలకడగా రాణించడంతో పాటు…51 కిలోల విభాగంలో మేరీకోమ్ కు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన నిఖత్…త్వరలో జరిగే టోక్యో ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్ లో పోటీకి తహతహలాడుతోంది.

ఒలింపిక్స్ కు భారత బాక్సింగ్ జట్టు ఎంపిక కోసం…జులైలో భారత బాక్సింగ్ సమాఖ్య నిర్వహించే సెలెక్షన్ ట్రయిల్స్ లో అపారఅనుభవం ఉన్న మేరీ కోమ్ తో నిఖత్ తలపడాల్సి ఉంది.

ఒలింపిక్స్ అర్హత కోసం పూర్తిస్థాయిలో సాధన చేస్తున్న నిఖత్ రష్యా వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రపంచ బాక్సింగ్ పోటీలకు సైతం సిద్ధమవుతోంది.

ప్రభుత్వ ప్రోత్సాహమే కీలకం….

ప్రపంచ బాక్సర్ గా ఎదగాలంటే ప్రపంచస్థాయి శిక్షణ సదుపాయాలు ఉండితీరాలని…నిజామాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో కనీస సదుపాయాలు కరువని నిఖత్ వాపోతోంది.

తన కుటుంబసభ్యులు, ప్రధానంగా తండ్రి ప్రోత్సాహం మరువలేనిదని…తెలంగాణా ప్రభుత్వం నుంచి తనకు మరింత అండదండలు అవసరమని నిఖత్ భావిస్తోంది.

బ్యాడ్మింటన్, క్రికెట్ లాంటి క్రీడాకారిణులకు ఇస్తున్న ప్రోత్సాహం బాక్సర్లకు సైతం ఇవ్వాలని నిఖత్ ప్రాధేయపడుతోంది.

మేరీ కోమ్ ప్రేరణతో….

ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ విజేతగా నిలిచిన మేరీ కోమ్ స్ఫూర్తితో తన బాక్సింగ్ కెరియర్ కొనసాగిస్తున్నానని…మేరీ కోమ్ ను చూసి తాను ఎంతో నేర్చుకొన్నానని..చివరకు మేరీ కోమ్ తోనే తలపడటం తనకు గర్వకారణమని ఈ నిజామాబాద్ మెరుపు బాక్సర్ చెబుతోంది.

తెలంగాణా మేరీకోమ్ గా ఇప్పటికే గుర్తింపు తెచుకొన్న నిఖత్ జరీన్ సాధించాల్సింది ఎంతో ఉంది. టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ లో పాల్గొనటానికి నిఖత్ అర్హత సాధించగలిగితే…జీవితమే మారిపోతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.