Telugu Global
NEWS

అధికారంలోకి వస్తే నో జంప్ జిలాని : వైసీపీ నిర్ణయం...!

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖరారైంది అంటున్నారు. వివిధ పార్టీలు, సంస్థలు చేసిన సర్వేల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని తేలింది. నారా చంద్రబాబు నాయుడు కూడా తమకు ఓటమి తప్పదని లోలోన మధన పడుతున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులు అయితే సరేసరి. వారు ఓటమిని ముందే అంగీకరించారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావాలని మంత్రులు, ఆ పార్టీ […]

అధికారంలోకి వస్తే నో జంప్ జిలాని : వైసీపీ నిర్ణయం...!
X

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం దాదాపు ఖరారైంది అంటున్నారు. వివిధ పార్టీలు, సంస్థలు చేసిన సర్వేల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందని తేలింది.

నారా చంద్రబాబు నాయుడు కూడా తమకు ఓటమి తప్పదని లోలోన మధన పడుతున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులు అయితే సరేసరి. వారు ఓటమిని ముందే అంగీకరించారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావాలని మంత్రులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకరిద్దరు మంత్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నట్లు సమాచారం. వారితో పాటుగా మరికొందరు సీనియర్ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీని వీడాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు.

ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి చేరికలను ప్రోత్సహించరాదని, జంప్ జిలానీలకు తమ పార్టీలో అవకాశం ఇవ్వరాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్థిర నిశ్చయంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ నుంచి విజయం సాధించి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం పోరాడిన వైయస్సార్ కాంగ్రెస్ తిరిగి అదే పని చేయడం సబబు అనిపించుకోదని జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వద్ద అన్నట్లు చెబుతున్నారు.

తమ పార్టీ నుంచి బయటకు వెళ్లి తెలుగుదేశం పార్టీలో పాటు వివిధ పదవులు పొందిన తమ పార్టీ ఎమ్మెల్యేలను అనర్హుడిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని, ఇప్పుడు మళ్ళీ తామే ఆ పని చేస్తే ప్రజల్లో చులకన అయిపోతామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఒకవేళ ఒకరిద్దరు సీనియర్ నాయకులు తప్పనిసరిగా వై.ఎస్.ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని అనుకుంటే వారి చేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించాలని, ఆ పని జరిగిన తర్వాతే వారిని పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సీనియర్ నాయకులతో అన్నట్లు సమాచారం.

ఇలా చేయడం వల్ల ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వసనీయత పెరుగుతుందని, అలాగే తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత కూడా పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. ఎన్నికల్లో విజయం తర్వాత అధికార పార్టీలోకి మారే దుష్ట సంప్రదాయానికి తామే చరమగీతం పాడాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో అన్నట్లు గా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

First Published:  5 May 2019 10:35 PM GMT
Next Story