మంత్రి పదవులు కాదు… హోదా ముఖ్యం: జగన్

“కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటో రెండో మంత్రి పదవులు తీసుకుని తృప్తి పడటం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా మనం జత కట్టేందుకు సిద్ధ పడాలి” ఇవి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మాటలు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిపై జరిగిన సమావేశంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాకే మన మద్దతు అని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు ఎంత కీలకమో… రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా అంతే కీలకమని జగన్ వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఒకరిద్దరు నాయకులు కేంద్రంలో మంత్రి పదవుల అంశం ప్రస్తావించినట్లు సమాచారం.

దీనిపై సున్నితంగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరు ప్రకటిస్తే ఆ పార్టీకి షరతులు లేకుండా మద్దతు తెలపాలని పార్టీ నిర్ణయించినట్లుగా సమావేశంలో అన్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.

ఆ పాలన నుంచి విముక్తి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను గెలిపించుకుంటున్నారని, మంత్రి పదవులకు, ఇతర ప్రలోభాలకు ప్రజల ఆశలను వమ్ము చేయరాదని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం.

నిజాయితీకి, ఇచ్చిన మాటకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనే పేరు రావాలి తప్ప… పదవులు ముఖ్యం కాదని ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అభిప్రాయ పడినట్లు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా… వారు ప్రత్యేక హోదా ఇస్తామంటే మద్దతు తెలపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా జగన్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.