మోదీ ప్రధాని అయితే… బాబులో కలవరం!

తెలుగుదేశం పార్టీ అధినేత ఆందోళనలో పడిపోయారా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి రావడం దాదాపుగా తథ్యమని తేలిపోవడంతోనే బాబు కొంత ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు.

ఖజానా మొత్తం ఊడ్చేసి ఉన్న నిధులన్నింటినీ సంక్షేమ పథకాలకు మళ్లించినా తనకు ఎందుకు ప్రయోజనం కలగడం లేదో తెలియక ఆయన ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యంగా పసుపు కుంకుమ, రైతుబంధు పథకాలు, పింఛన్ల పెంపు మీద భారీగా నమ్మకం పెట్టుకున్నారు.

ఈ పథకాలు కూడా అంతగా పని చేయలేదని తెలుగు తమ్ముళ్ల నుంచి నివేదికలు రావడం బాబును కలవరపెడుతోందని అంటున్నారు. పైకి గంభీరంగా తెలుగుదేశం గెలిచి తీరుతుందని చెబుతున్నా, లోలోపల ఆయనను ఓటమి భయం
వెంటాడుతున్నదని అంటున్నారు.

అసలు బీజేపీని విడిచి తప్పు చేశామని, తెగదెంపులు చేసుకున్నా, ఆ పార్టీతో అంత విరోధం పెంచుకుని ఉండాల్సింది కాదని బాబు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో… ఒకవేళ రేపు కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వచ్చి, మోడీ కనుక మళ్లీ ప్రధాని అయితే తిప్పలు తప్పవని బాబు భయపడుతున్నారని చెబుతున్నారు.

నిజానికి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మునుపెన్నడూ లేనంతగా అసహనానికి గురయ్యారు. అక్కడక్కడా మోడీ మీద, జగన్ మీదా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆయా నియోజక వర్గాలలో టీడీపీ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని తన సర్వేలో తేలడంతోనే బాబు మోతాదుకు మించి మాట్లాడి ఉంటారని, అవే ఇప్పుడు బాబును ఆందోళనలో పడేసి ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి తిరిగి అధికారం దక్కకపోయినా, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా బాబుకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఒకవేళ మిత్రపక్షాల సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఏపీలో టీడీపీ గెలిస్తేనే బాబుకు ఢిల్లీలో విలువ ఉంటుందని అంటున్నారు.

ఈ రెండు జరిగే అవకాశాలు అంతగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్నాకే చంద్రబాబులో గుబులు మొదలైందనేది పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.