ఐపీఎల్ ఫైనల్లో ఆరోసారి ముంబై

  • తొలి క్వాలిఫైయర్ లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు
  • చెపాక్ స్టేడియంలో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు
  • స్పిన్ పిచ్ పై చేతులెత్తేసిన ఎల్లో ఆర్మీ

ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ కు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ దూసుకెళ్లింది. స్పిన్ బౌలింగ్ కు అనువుగా తయారు చేసిన చెన్నై చెపాక్ స్టేడియం పిచ్ పైన జరిగిన తొలి క్వాలిఫైయర్ సమరంలో ముంబై 6 వికెట్ల తేడాతో విజేతగా నిలిచింది.

ఫైనల్లో ముంబై ఆరోసారి….

ఐపీఎల్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ముంబై, చెన్నై జట్లు పేర్లు మాత్రమే. ప్రస్తుత 2019 సీజన్లో సైతం ఈ రెండుజట్ల జోరే కొనసాగుతోంది. 12వ సీజన్ లీగ్ టేబుల్ మొదటి నాలుగు స్థానాలలో నిలిచిన ఈ రెండుజట్ల మధ్య ముగిసి తొలి క్వాలిఫైయర్ సమరం లోస్కోరింగ్ మ్యాచ్ గా ముగిసింది.

చెన్నై కి ముంబై స్పిన్నర్ల పగ్గాలు…

స్పిన్నర్ల స్వరంగా మారిన చెపాక్ పిచ్ పై చెన్నై కెప్టెన్ ధోనీ ముందుగా కీలక టాస్ నెగ్గినా…హోంఎడ్వాంటేజ్ ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

పవర్ పుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన చెన్నైని ముంబై స్పిన్నర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. 20 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కట్టడి చేశారు. చెన్నై మిడిలార్డర్ ఆటగాళ్లు అంబటి రాయుడు, కెప్టెన్ ధోనీ ఫైటింగ్ బ్యాటింగ్ తో కనీసం ఈ స్కోరైనా
సాధించగలిగింది.

రాయుడు 37 బాల్స్ లో 3 బౌండ్రీలు, సిక్సర్ తో 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ ధోనీ 37 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. ముంబై స్పిన్నర్లలో లెగ్ స్పిన్నర్ చాహర్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

సూర్యకుమార్ షో…

132 పరుగుల స్పల్పలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ముంబై…ప్రారంభ ఓవర్లలోనే ఓపెనర్ల జోడీ రోహిత్ శర్మ, డికాక్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ సమయోచితంగా ఆడి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.
సూర్య కుమార్ మొత్తం 54 బాల్స్ ఎదుర్కొని 10 బౌండ్రీలతో 71 పరుగుల నాటౌట్ స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

చివరకు ముంబై 18.3 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే నష్టపోయి విజేతగా నిలిచింది. మే 12న హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషల్ స్టేడియం వేదికగా జరిగే టైటిల్ సమరంలో ముంబై పోటీపడుతుంది. గతంలోనే ఐదుసార్లు ఫైనల్స్ చేరి రెండుసార్లు విజేతగా నిలిచిన ముంబై మరో టైటిల్ కోసం తహతహలాడుతోంది.

చెన్నైకి మరో చాన్స్….

హోం ఎడ్వాంటేజ్ ను సద్వినియోగం చేసుకోలేక ఘోరపరాజయం పొందిన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్… తొలి క్వాలిఫైయర్ లో ఓటమి పొందినా…ఫైనల్స్ చేరటానికి మరో అవకాశం మిగిలే ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల ఎలిమినేటర్ రౌండ్లో నెగ్గిన జట్టుతో…మే 10న విశాఖ వేదికగా జరిగే రెండో క్వాలిఫైయర్ లో.. తలపడాల్సి ఉంది.

మొత్తం మీద…ప్రస్తుత సీజన్లో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఆరోసారి ఫైనల్స్ చేరడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకోగలిగింది.