ఐపీఎల్-12లో ముగిసిన హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ

  • ఎలిమినేటర్ రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
  • ఢిల్లీకి క్వాలిఫైయర్స్ బెర్త్ ఖాయం చేసిన రిషభ్ పంత్

ఐపీఎల్-12వ సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ ముగిసింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో కేవలం 12 పాయింట్లు మాత్రమే సాధించినా.. అదృష్టవశాత్తు ఎలిమినేటర్ రౌండ్ చేరినా…సన్ రైజర్స్ క్వాలిఫైయర్స్ -2 సమరానికి అర్హత సాధించలేకపోయింది.

స్టీల్ సిటీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా ముగిసిన ఎలిమినేటర్ రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో బంతి మిగిలిఉండగానే 2 వికెట్ల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ ను అధిగమించి…రెండో క్వాలిఫైయర్స్ రౌండ్లో పోటీకి అర్హత సాధించింది. ఢిల్లీ విజయంలో ప్రధానపాత్ర వహించిన యువఆటగాడు రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఢిల్లీ క్యాపిటల్స్ కు కుర్రాళ్ల దన్ను…

నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొన్నాడు.

దీంతో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు సాధించింది. ఓపెనర్ గప్టిల్ 36, వన్ డౌన్ మనీష్ పాండే 30 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో కీమో పాల్ 3 వికెట్లు, ఇశాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

పృథ్వీ షా, పంత్ పోరాటం…

20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్- పృథ్వీ షా అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 7.3 ఓవర్లలోనే మొదటి వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం అందించారు.

ధావన్ 17 పరుగులకు అవుట్ కాగా… యువఓపెనర్ పృథ్వీ 38 బాల్స్ లో6 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 56 పరుగులకే వెనుదిరిగాడు.

ఆ తర్వాత ఢిల్లీ వరుసగా వికెట్లు నష్టపోతున్నా…. యువహిట్టర్ రిషభ్ పంత్ మాత్రం తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ సిక్సర్ల మోత మోగించాడు.

5 సిక్సర్లు, 2 బౌండ్రీలతో 49 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలవడంతో ఢిల్లీ 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు సాధించి… 2 వికెట్ల విజయం సొంతం చేసుకొంది.

శుక్రవారం జరిగే రెండో క్వాలిఫైయర్ రౌండ్ మ్యాచ్ లో… డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.

ఐపీఎల్ క్వాలిఫైయర్స్ రౌండ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ అర్హత సాధించడం ఇదే మొదటిసారి. విశాఖ వేదికగా ముగిసిన ఈమ్యాచ్ కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.