ఎవరికీ పట్టని ఐపీఎల్ మహిళా టీ-20 చాలెంజ్

  • జైపూర్ మ్యాచ్ కు 200 మంది మాత్రమే హాజరు
  • మంథానా జట్టుపై మిథాలీసేన విజయం

భారత్ లో మహిళా టీ-20 క్రికెట్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ మహిళా టీ-20 చాలెంజర్ టోర్నీ ఎవరికీ పట్టనిదిగా మారింది.

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న మూడుజట్ల ఈటోర్నీకి కేవలం 200 మంది మాత్రమే హాజరు కావడం చూస్తే.. మహిళా క్రికెట్ కు ఏపాటి ఆదరణ ఉందీ అర్థమవుతుంది.

మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ, స్మృతి మంథానా కెప్టెన్సీలోని ట్రెయిల్ బ్లేజర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో…మరో 12 బాల్స్ మిగిలి ఉండగానే వెలాసిటీ 3 వికెట్ల విజయం నమోదు చేసింది.

మూడుజట్ల రౌండ్ రాబిన్ లీగ్ లోని ఈ రెండోమ్యాచ్ లో…వెలాసిటీ జట్టు టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది. ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు 20 ఓవర్లలో 67 వికెట్లకు 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. డియోల్ 43 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది.

సమాధానంగా 114 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన వెలాసిటీ జట్టు 18 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులతో విజేతగా నిలిచింది. షెఫాలీ 34, డేనియెల్ వెయిట్ 46 పరుగుల స్కోరు సాధించారు. డేనియల్ వెయిట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.