చంద్రబాబుకు షాకిచ్చిన మమతా బెనర్జీ

మే 23న ఫలితాలు…. అధికారంలోకి వస్తామని కలలుగంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోలుకోలేని షాక్ ఇచ్చారు. చంద్రబాబు వ్యూహానికి చెక్ పెట్టారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఈనెల 21న విపక్షాల తో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ కు మద్దతుగా రాజకీయం చేయాలనుకున్న చంద్రబాబు ప్రయత్నాలకు మమతా బెనర్జీ చెక్ పెట్టి అటు కాంగ్రెస్ కు, ఇటు చంద్రబాబుకు గట్టి హెచ్చరికలు పంపారు.

విపక్షాలన్నీ కలిసి ఓ ఉమ్మడి వ్యూహాన్ని రచించి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి ముందస్తు కార్యాచరణకు నడుం బిగించాలనేది రాహుల్, చంద్రబాబు వేసిన స్కెచ్.

అయితే ఫలితాలకు ముందే మే 21న సమావేశాన్ని నిర్వహించడానికి మమతా బెనర్జీ వ్యతిరేకించారు. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు ఈ విషయమై మమతతో చర్చించినా ఆమె ససేమిరా అన్నారట.

గురువారం రాత్రి ఇద్దరు సీఎంలు బాబు, మమత దాదాపు 45 నిమిషాల పాటు జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఫలితాలకు ముందే విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకురావాలనే ప్రతిపాదనపై ఇరువురు చర్చించారు.

అయితే ఈవీఎంల భద్రతపై దృష్టి సారించాల్సి ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని మమతా బెనర్జీ చంద్రబాబు తో చెప్పినట్టు సమాచారం. అయితే ఎక్కువ సీట్లు వస్తే ప్రధాని పీఠంపై కన్నేసిన మమతా అందుకే వ్యూహాత్మకంగా 21న మీటింగ్ జరగకుండా వ్యతిరేకించినట్లు భావిస్తున్నారు.