మరో ఐదేళ్లు ఇండియా మోడీని భరించగలదా..? టైమ్‌ సంచలన కథనం

దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు జరుగుతన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలి, వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ టైమ్ మ్యాగజైన్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ అంటూ ఆ పత్రిక కవర్ పేజీ కథనాన్ని అచ్చేశారు. దీనికి భారతదేశ విచ్ఛిన్నవాది అనే అర్థం. మోడీ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఈ కథనం కొనసాగింది.

గుజరాత్‌కు సుదీర్ఘ కాలం సీఎంగా ఉండి భారత దేశ ప్రధాని అయిన మోడీ పాలన ఏనాడూ సజావుగా సాగలేదు. మోడీ పాలనలో ఉదారవాదుల నుంచి మైనార్టీలు, ఇతర మతాల వారు దాడులు ఎదుర్కుంటున్నారు.

2014లో ఒక ఆశావాద వాతావరణం ఉండేది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో మాత్రం అలాంటి ఆశ అనేది లేదని ఆ కథనంలో పేర్కొన్నారు. అప్పట్లో అద్భుతమైన భవిష్యత్తును నిర్మించగలిగే నేత…. హిందూ మతానికి పునరుజ్జీవం తెచ్చే నేతగా కొనియాడారు. దేశానికి గొప్ప ఆర్థిక స్వావలంభన తీసుకొస్తారని భావించారు. కానీ నేడు అదే మోడీ ఒక్క హామీనీ అమలు చేయలేని ఒక విఫల రాజకీయ వేత్త అని విమర్శలు గుప్పించారు.

మోడీ గత ఎన్నికల్లో చెప్పిన ఆర్థిక విధానాలు అద్భుతాలు సృష్టించడం అటుంచి.. అసలు ఆర్థిక వ్యవస్థే నిర్వీర్యం అయ్యేలా పలు విధానాలు అమలు చేశారు. మతరాజకీయాలను సృష్టించడంలో ఆయన సఫలమయ్యారని ఆ కథనంలో రాశారు.

మత విద్వేషాన్ని విరజిమ్మే యోగీ ఆదిత్యనాథ్ వంటి వ్యక్తిని సీఎం చేశారు. మాలేగావ్ పేలుళ్ల నిందితురాలిని ఎన్నికల్లో నిలబెట్టడం మోడీ మనస్థత్వాన్ని చూపెడుతుందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే ఆర్బీఐ గవర్నర్‌గా ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని నియమించడం చాలా దారుణమైన విషయమని పేర్కొన్నారు.

ప్రతిపక్షాల బలహీనతే మోడీకి బలంగా మారిందని.. దేశ ప్రజలకు గత ఐదేళ్లుగా ఏమీ చేయని వ్యక్తిని ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ కలిగిన భారత్ మరో ఐదేళ్లు భరించగలదా? అని ప్రశ్నించారు. టైమ్ పత్రిక కథనం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా నుంచి వెలువడే ఆ పత్రికలో ఈ కథనాన్ని రాసిన వ్యక్తి భారతీయుడే కావడం గమనార్హం.