ఆరో దశ పోలింగ్…. ఎవరికి అనుకూలం…?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం నాడు ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా ఆరు రాష్ట్రాల్లో ఆరో విడత పోలింగ్ కు సర్వం సన్నద్ధం అయింది.

మొత్తం 59 లోక్ సభ నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్ లో 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏడు లోక్ సభ నియోజకవర్గాల తో సహా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజక వర్గాలకు, హర్యానాలో 10 నియోజక వర్గాలకు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ లలో ఎనిమిదేసి నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

గత ఐదు విడతల్లో జరిగిన పోలింగ్ లో అధికార భారతీయ జనతా పార్టీకి ఆశించినన్ని స్థానాలు రావని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన రెండు విడతల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలు దక్కించుకుంటే తప్ప నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని అయ్యే అవకాశాలు తక్కువే అంటున్నారు.

ఎన్నికలకు ముందున్న పరిస్థితి అధికార పార్టీకి నేడు కనిపించడం లేదని, ఐదు విడతల్లో జరిగిన పోలింగ్ లోను బీజేపికి వందకు మించి ఎక్కువ స్ధానాలు వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆరో విడత ఎన్నికల పోలింగ్ లో జాతీయ పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఎన్నికల బరిలో నిలిచారు. భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజ్ఞా ఠాగూర్ భోపాల్ నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇక ఢిల్లీలో ఓ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే మరో నియోజకవర్గం నుంచి ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. రెండు విడతలు మాత్రమే పోలింగ్ మిగిలి ఉన్న ప్రస్తుత దశలో అధికారాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్క స్థానం కీలకమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని, ముఖ్యంగా ఆదివారం జరుగుతున్న ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.

ఈ ఎన్నికల అనంతరం మమతాబెనర్జీ అధికారంలో కొనసాగడం కష్టమంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. దీంతో మమతా బెనర్జీ కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ రాజకీయ యుద్ధం లో ఎవరిది పైచేయిగా మిగులుతుందో తేలాలంటే మరో పది రోజులు ఆగాలి.