మహాసముద్రం నీరుకారిపోయింది

నాగచైతన్య నుంచి మరో ప్రాజెక్టు చేజారిపోయింది. గతంలో కొన్ని సూపర్ హిట్ సినిమాల్ని తన చేజేతులా వదులుకున్న ఈ హీరో, తాజాగా మహాసముద్రం అనే మరో ప్రాజెక్టును వదులుకున్నాడు. భవిష్యత్తులో ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.

ఇక విషయంలోకి వస్తే.. దాదాపు నెల రోజులుగా దర్శకుడు అజయ్ భూపతి, నాగచైతన్య మధ్య మహాసముద్రం సినిమాకు సంబంధించి కథాచర్చలు జరిగాయి. అంతా సజావుగా సాగుతుందనుకున్న టైమ్ లో నాగచైతన్య వెనకడుగు వేశాడు. మహాసముద్రం అనేది పూర్తిగా మాస్ కథ. ఇందులో నాగచైతన్యది పోలీసాఫీసర్ రోల్. మజిలీ లాంటి ఎమోషనల్ హిట్ కొట్టిన వేళ, మహాసముద్రం లాంటి మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం కరెక్ట్ కాదని ఫీల్ అయ్యాడు చైతూ.

పైగా మాస్ సినిమాలకు సంబంధించి నాగచైతన్యకు గతానుభవాలు చాలానే ఉన్నాయి. మాస్ సినిమాలు చేసిన ప్రతిసారి ఫ్లాపులు తెచ్చుకుంటూనే ఉన్నాడు ఈ హీరో. చివరికి ఈ విషయంలో సమంత కూడా చైతూను ఆదుకోలేకపోయిన సందర్భాలున్నాయి. అందుకే మాస్ సినిమా అయిన మహాసముద్రానికి దూరంగా జరిగాడు చైతూ.

ప్రస్తుతం ఈ సినిమా రవితేజ చెంతకు చేరింది. త్వరలోనే అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అప్పుడు చైతూ ఎలా స్పందిస్తాడో చూడాలి.