ఎవరి ట్రాప్ లో ఎవరు పడ్డారు ?

గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారా? లేక కాంగ్రెస్ పార్టీయే ఆయన్ని ముగ్గులోకి లాగుతోందా? తెలియడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మొత్తానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న సూచనలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయని అంటున్నారు. కమలదళానికి
తిరిగి అధికారం లభించే అవకాశాలు సన్నగిల్లడంతో కేసీఆర్ హస్తం వైపు అడుగులు వేస్తున్నారన్నది ఒక వాదనగా ఉంది. కాంగ్రెసే కావాలని కేసీఆర్ ను బీజేపీ నుంచి దూరం చేసేందుకు వ్యూహం పన్నిందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయనను దగ్గరకు తీస్తో్ందనే మరో వాదనగా ఉంది.

అయితే అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే తాను కీలక పాత్ర పోషించి ప్రాంతీయ పార్టీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని తమ అధినేత భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సర్కారు ఏర్పాటుకు ఎవరు దగ్గరగా ఉంటే వారితో జత కట్టేందుకు కేసీఆర్ మానసికంగా సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు.

ఈసారి కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోవాలని ఆయన ఆలోచనగా ఉందని చెబుతున్నారు. అందుకే రెండు జాతీయ పార్టీలతోనూ సమాన దూరం పాటిస్తున్నారని అంటున్నారు.

2014లోనే కేంద్రంలో చేరాలని కేసీఆర్ భావించినప్పటికీ, అప్పుడు బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో సాధ్యం కాలేదని అంటున్నారు. రాష్ట్రంలో తాము రెండోసారి అధికారంలోకి వచ్చినందున, తమకు కేంద్రం అండ ఉంటే అటు రాజకీయంగానూ, ఇటు ప్రభుత్వపరంగానూ మేలు జరిగే అవకాశాలుంటాయని కేసీఆర్ అనుకుంటున్నట్టు తెలిసింది.

అందుకే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అందులో తమ పాత్ర ముఖ్యంగా ఉండాలనేదే టీఆర్ఎస్ అధినేత ఆలోచన అని చెబుతున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపారంటున్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కేసీఆర్ తో మాట్లాడాల్సిందిగా కేరళకు చెందిన పార్టీ నేత ఊమెన్ చాందీని పురమాయించినట్టు సమాచారం. ఈ పరిణామాన్నింటిని నిశితంగా గమనిస్తున్న బీజేపీ నేతలు కేసీఆర్ తో సామరస్యంగానే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

ఏపీ, తెలంగాణలో టీఆర్ఎస్, వైసీపీకి దాదాపు 40 సీట్లు రావచ్చని కమలనాథులు అంచనా వేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.