కంటితుడుపుగా ముగిసిన మహిళా ఐపీఎల్

  • ఐపీఎల్ మహిళా చాలెంజ్ సిరీస్ విజేత సూపర్ నోవాస్ 
  • ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సుడిగాలి హాఫ్ సెంచరీ
  • టైటిల్ సమరంలో వెలాసిటీ చిత్తు

ఐపీఎల్ 2019 మహిళా చాలెంజ్ సిరీస్ టైటిల్ ను హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ జట్టు గెలుచుకొంది.
జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్లో సూపర్ నోవాస్ 4 వికెట్లతో వెలాసిటీని అధిగమించింది.

మిథాలీ రాజ్ ఫ్లాప్ షో…

మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్ జట్ల మధ్య జరిగిన ఈ టైటిల్ ఫైట్ లో…
సూపర్ నోవాస్ కీలక టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొంది.

వెలాసిటీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మిథాలీ 12 పరుగులకే అవుట్ కాగా…మిడిలార్డర్ ప్లేయర్లు షెఫాలీ వర్మ 40, కెర్ 36 పరుగుల స్కోర్లతో తమ జట్టును ఆదుకొన్నారు. సూపర్ నోవాస్ ఓపెనింగ్ బౌలర్ తహుహుకు 2 వికెట్లు దక్కాయి.

హర్మన్ ప్రీత్ మెరుపు హాఫ్ సెంచరీ…

122 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన సూపర్ నోవాస్ లక్ష్యాన్ని చేరటానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. ఎదురుదాడి బ్యాటింగ్ తో ఆఖరి బాల్ విజయాన్ని సొంతం చేసుకొంది.

హర్మన్ ప్రీత్ కౌర్ 37 బాల్స్ లో 4 బౌండ్రీలు, 3 సిక్సర్లతో51 పరుగుల స్కోరుకు అవుటయ్యింది. చివరకు సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 125 పరుగుల స్కోరుతో విజేతగా నిలిచింది.

సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్, యువఓపెనర్ జెమీమా రోడ్రిగేస్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డులు దక్కాయి.

మహిళా క్రికెట్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో భారత క్రికెట్ బోర్డు నిర్వహించిన మూడుజట్ల ఈ టోర్నీకి ఏ మాత్రం ఆదరణ దక్కకపోడం తీవ్రనిరాశను మిగిల్చింది. మహిళా క్రికెట్ ఓ క్రికెట్టేనా అన్న విమర్శలకు బలం చేకూర్చుతూ చాలెంజ్ సిరీస్ ముగిసింది.