బాబుతో సీఎస్…. ఏం జరగబోతోంది….

దేవుడు వరమిచ్చినా.. పూజారి అనుమతి ఇవ్వడం లేదన్నది సామెత.. ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసే కేబినెట్ భేటీ నిర్ణయం ఈసీ చేతుల్లోకి వెళ్లింది. అక్కడ అనుమతి వస్తేనే తాను నిర్వహిస్తానని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. దీంతో ఎంతకు తెగని ఈ పంచాయతీపై కీలక పరిణామం ఈరోజు చోటుచేసుకుంది.

ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 14న తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతి ఇప్పటివరకు రాలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. కానీ భేటి నిర్వహించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. దీంతో ఈసీ పంతం నెరవేరుతుందా.? చంద్రబాబు పట్టుదల నిలుస్తుందా? చూడాలి.

అయితే దేశంలో ఆరోవిడత పోలింగ్ హడావుడిలో ఉన్న ఎన్నికల సంఘం చంద్రబాబు కేబినెట్ భేటీ ప్రతిపాదనపై పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏడో విడతకు ఏర్పాట్లలో బిజీగా ఉంది. సోమవారం సాయంత్రం దీనిపై ఏదో నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి.

అయితే కాసేపట్లో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం చంద్రబాబును కలువనున్నారు. వారిద్దరి భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎస్ గా నియామకమయ్యాక వీరిద్దరూ ఉప్పు-నిప్పులా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలవబోతుండడం ఉత్కంఠ రేపుతోంది. క్యాబినేట్ భేటీ అంశం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా కనిపిస్తోంది