పెద్ద పని పూర్తిచేసిన మన్మధుడు

కథ ప్రకారం మన్మధుడు-2 సినిమాకు సంబంధించి ఫారిన్ బ్యాక్ డ్రాప్ ఎక్కువ. అలాంటి కీలకమైన షెడ్యూల్ ను మన్మధుడు-2 యూనిట్ పూర్తిచేసింది. పోర్చుగల్ లో కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యూనిట్, ఎట్టకేలకు ఆ భారీ షెడ్యూల్ ను ముగించింది.

ఏకథాటిగా 32 రోజుల పాటు పోర్చుగల్ షెడ్యూల్ సాగింది. ఈ షెడ్యూల్ లో హీరో నాగార్జున, హీరోయిన్ రకుల్ తో పాటు వెన్నెల కిషోర్, సమంత లాంటి చాలామంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈమధ్య కాలంలో నాగార్జున విదేశాల్లో చేసిన అతిభారీ షెడ్యూల్ ఇదే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోర్చుగల్ ఎపిసోడ్ మొత్తం హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.

ఇకపై సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన విలేజ్ సెట్ తో పాటు.. మరికొన్ని సన్నివేశాల్ని రామోజీ ఫిలింసిటీలో తీయబోతున్నారు. సమ్మర్ పూర్తయిన వెంటనే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.