నో సినిమా…. ఓన్లీ పాలిటిక్స్

ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పవన్ కల్యాణ్ మరోసారి ముఖానికి రంగేసుకుంటారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక్కడితో ఇవి ఆగలేదు. రామ్ తళ్లూరి నిర్మాతగా డాలీ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని కూడా ప్రచారం ఊపందుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి స్వయంగా పవన్ కల్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టాడు.

గుంటూరులో జరిగిన జనసేన సమీక్ష సమావేశంలో తన సినిమా రీఎంట్రీపై పవన్ స్పష్టంగా స్పందించారు. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చానని, ఫలితాల తర్వాత తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతానంటూ వచ్చిన వార్తల్ని నమ్మొద్దంటూ జనసైనికులకు పిలుపునిచ్చాడు. తను రాజకీయాల నుంచి పక్కకు వెళ్లేది లేదని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యే ఉంటానని స్పష్టంగా చెప్పాడు పవన్ కల్యాణ్. అయితే తన ప్రసంగంలో నిర్మాత, దర్శకుల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.

దాదాపు ఇదే అభిప్రాయాన్ని కొన్ని రోజుల కిందట నాగబాబు కూడా వ్యక్తపరిచాడు. పవన్ సినిమాల్లోకి మళ్లీ వస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని నాగబాబు ఖండించాడు. ఇది కేవలం ప్రత్యర్థుల కుట్ర మాత్రమేనని, పవన్ మాత్రం మళ్లీ సినిమాలు చేసే ఆలోచనలో లేడని ప్రకటించాడు.