ర‌విప్ర‌కాష్ అరెస్టుకు రంగం సిద్ధం !

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయ‌న అరెస్టుకు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే రెండు సార్లు సైబ‌రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ర‌విప్ర‌కాష్ విచార‌ణ‌కు రాక‌పోవ‌డంతో 41సీఆర్పీసీ ప్ర‌కారం ఆయ‌న‌కు మ‌రోసారి నోటీసులు జారీ చేసే అవ‌కాశం ఉంది. ఈ నోటీసుల‌కు ర‌విప్రకాష్ స్పందించ‌క‌పోతే ఆయ‌న్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.

ర‌విప్ర‌కాష్‌తో పాటు శివాజీ కూడా ఇదే సెక్ష‌న్ ప్ర‌కారం ఇప్ప‌టికే నోటీసులు ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇవాళ స్పందించ‌క‌పోతే ఆయ‌న్ని కూడా అరెస్టు చేస్తార‌ని తెలుస్తోంది. మొత్తానికి ర‌విప్ర‌కాష్ అండ్ బ్యాచ్ చుట్టూ పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. ర‌విప్ర‌కాష్ అరెస్టుకు కావాల్సిన ఆధారాల్ని పోలీసులు సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

టీవీ 9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ డైరెక్ట‌ర్ కౌశిక్ రావు ఫిర్యాదు మేర‌కు ర‌విప్ర‌కాష్‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి.

సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్‌…. మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారంటూ అలంద సంస్థ డైరెక్టర్‌ పి.కౌశిక్‌ రావు పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు రవిప్రకాష్ తో పాటు సినీనటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిపై కేసులు నమోదుచేశారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే ఈ ముగ్గురికి 160 సీఆర్పీసీ నోటీసులు జారీచేశారు.

అయితే పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేసినా రవిప్రకాష్, శివాజీ స్పందించలేదు. ఈ క్రమంలో ఆదివారం విచారణకు హాజరుకావాలంటూ రెండోసారీ నోటీసులిచ్చారు. రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. దీంతో ఈసారి 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులనే కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ ఇస్తారు. అంటే రవిప్రకాశ్‌ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది.