ర‌వి ప్ర‌కాష్ ఎక్క‌డ‌? ఏపీకి పారిపోయాడా?

టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ అజ్ఞాత‌వాసిగా మారాడు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నాడో ఎవరికీ తెలియడం లేదు. టీవీ9 నుంచి తీసివేసిన త‌ర్వాత ఆయ‌న స‌మాచారం లేకుండా పోయింది. పోలీసుల విచార‌ణ‌కు కూడా హాజ‌రుకాలేదు. ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ ప‌దిరోజుల టైమ్ కావాల‌ని పోలీసుల‌ను కోరారు. కానీ పోలీసులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

ర‌విప్ర‌కాష్ ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాడు? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హైద‌రాబాద్‌లోనే ఎక్క‌డైనా దాక్కున్నాడా? మే23 వ‌ర‌కు త‌న‌కు సేఫ్ ప్లేస్ అని భావిస్తున్న ఏపీలో త‌లదాచుకుంటున్నాడా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీలో చీరాలకు చెందిన ఓ కుటుంబం రిసార్ట్స్‌లో ర‌విప్ర‌కాష్ షెల్టర్ తీసుకున్నార‌ని స‌మాచారం.

టీవీ9 కొత్త మేనేజ్‌మెంట్ టేకోవ‌ర్ చేసిన విష‌యం తెలిసిన వెంట‌నే…. ఆయ‌న త‌న స‌హ‌చ‌రుల‌కు ఫోన్ చేశార‌ని తెలుస్తోంది. కొత్త మేనేజ్‌మెంట్ లైవ్‌లు తీసుకోవ‌ద్ద‌ని కోరార‌ట‌. అయితే అక్క‌డ బ‌త‌క‌నేర్చిన ఓ బృందం మాత్రం లైవ్ తీసుకోక‌పోతే త‌మ ఉద్యోగానికి ఎస‌రు వ‌స్తుంద‌ని విష‌యం తెలిసి లైవ్ తీసుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత బులిటెన్‌లో హెడ్‌లైన్స్ కూడా పెట్టార‌ట‌.

టీవీ9లో కొత్త మేనేజ్‌మెంట్ లైవ్ క‌నిపించ‌గానే అసహ‌నానికి గురైన ర‌విప్ర‌కాష్ త‌న చాప్ట‌ర్ క్లోజ్ అయింద‌ని విష‌యం గ్ర‌హించిన‌ట్లు ఉన్నారు. అప్ప‌టినుంచి ఫోన్‌లు స్విచాప్ చేశారు. త‌న పాత స‌హ‌చ‌రుల‌కు ఎవ‌రికీ అందుబాటులో లేకుండా పోయారు. రెండు రోజులుగా ఆయ‌న ఎక్క‌డున్నాడో అన్న విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు.

మొత్తానికి ఈనెల 16న లా ట్రిబ్యున‌ల్‌లో వాటాల వివాదంపై కేసు విచార‌ణ జ‌రుగుతోంది. త‌న‌కు అనుకూలంగా తీర్పు వ‌స్తే…. చ‌క్రం తిప్పవ‌చ్చ‌ని ర‌విప్ర‌కాష్ ఆలోచ‌న‌. అయితే అక్క‌డ కూడా ఆయ‌నకు చుక్కెదురైతే….విదేశాల‌కు కూడా పారిపోవ‌చ్చ‌ని కొంద‌రు అంటున్నారు. త‌న‌కు వ్యాపారాలు ఉన్న ద‌క్షిణాఫ్రికాకు ఆయ‌న వెళ్లొచ్చ‌ని ఓ వార్త వినిపిస్తోంది.

మొత్తానికి ర‌విప్ర‌కాష్ చ‌క్రబంధంలో చిక్కుకున్నాడు. దాని నుంచి ఎలా బ‌య‌ట‌కు రావాలో తెలియ‌క గిజ‌గిజ‌లాడుతున్నాడు.