Telugu Global
NEWS

టీడీపీలో కౌంటింగ్ టెన్షన్...

కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎవరికి వారే విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, లోలోపల అందరూ టెన్షన్ పడిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, శ్రేణుల్లో కలవరపాటు కనిపిస్తోందని అంటున్నారు. అధినేత చంద్రబాబు గెలుపు మీద భరోసా ఇస్తున్నప్పటికీ వారిలో నమ్మకం కలుగడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా తాజా పరిణామాల మీద టీడీపీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ నడుస్తోందని అంటున్నారు. తాము తప్పక గెలుస్తామని భావించిన సీట్లలోనూ పరిస్థితులు అంత […]

టీడీపీలో కౌంటింగ్ టెన్షన్...
X

కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఎవరికి వారే విజయం మీద ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, లోలోపల అందరూ టెన్షన్ పడిపోతున్నారు.

ముఖ్యంగా టీడీపీ నేతలు, శ్రేణుల్లో కలవరపాటు కనిపిస్తోందని అంటున్నారు. అధినేత చంద్రబాబు గెలుపు మీద భరోసా ఇస్తున్నప్పటికీ వారిలో నమ్మకం కలుగడం లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా తాజా పరిణామాల మీద టీడీపీలో అంతర్గతంగా తీవ్రమైన చర్చ నడుస్తోందని అంటున్నారు.

తాము తప్పక గెలుస్తామని భావించిన సీట్లలోనూ పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవని వస్తున్న వార్తలతో వారు దిగులు
చెందుతున్నారని అంటున్నారు. ఒకవేళ అధికారం కోల్పోతే, ఆ తరువాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల మీదా ఆశలు వదులుకోవాల్సి వస్తుందని దిగులు చెందుతున్నారట.

ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ అదే ఊపు మీద పంచాయతీ ఎన్నికలకు వెళ్తుందన్నది నిర్వివాదాంశం. క్షేత్రస్థాయిలో తమ నేతలు పదవులలో ఉంటే పాలన సులువుతుందని అన్ని పార్టీలూ భావిస్తాయి.

ఏపీలో వైఎస్ఆర్ సీపీ గద్దెను ఎక్కే అవకాశాలు ఉన్నాయనే దాదాపుగా అందరి అభిప్రాయంగా ఉంది. అదే గనుక నిజమైతే ఆ తరువాత జరిగే ఎన్నికల ఫలితాలు కూడా వారికే అనుకూలంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

కానీ, తాము అధికారానికి దూరమైతే పార్టీ శ్రేణులు చెదిరిపోతారేమోనని, ఇది పార్టీ భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఉంటాయని టీడీపీ హార్డ్ కోర్ నేతలు ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పార్టీ శ్రేణులను నేతలు కాపాడుకుంటూ వచ్చారు. అందుకే సంస్థాగతంగా ఆ పార్టీ బలంగా ఉంటూ వచ్చింది.

కానీ, గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎక్కువ మంది కింది స్థాయి నేతలు కూడా అనివార్యంగా అధికార పార్టీ వైపు చూస్తూ వచ్చారు. అలా చూసేలా టీడీపీ పావులు కదిపిందని చెబుతున్నారు పరిశీలకులు.

ఇప్పుడు అధికారం నుంచి వైదొలగితే వైసీపీ నుంచి తమకు కూడా అవే పరిస్థితులు ఎదురవుతాయేమోనని వారు ఆందోళన చెందుతున్నారట. కచ్చితంగా ఓడిపోతామని నిర్ధారణకు వచ్చిన చోట కొందరు ఛోటోమోటా నేతలు ఇప్పటికే వైసీపీకి దగ్గర కావాలని చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

First Published:  13 May 2019 7:13 AM GMT
Next Story