ఈ సర్వేల గోలేమిటి బాబూ…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ సర్వేల గురించి మాట్లాడారు. తాను ఇప్పటి వరకు నాలుగు సర్వేలు చేయించానని, ప్రతి సర్వేలోనూ టీడీపీ గెలిచి తీరుతుందనే తేలిందని పార్టీ వర్గాలకు చెప్పుకొచ్చారు.

గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమీక్షలలో ఆయన ఈ మాటలు అంటూనే ఉన్నారు. ఒక వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని, నమ్మినవారే తమకు చేయిచ్చారని తమ్ముళ్లు సమీక్షా సమావేశాలలో మొత్తుకుంటూనే ఉన్నారు.

కానీ, చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పదలచుకున్నదే చెప్పేస్తున్నారని అంటున్నారు. సోమవారం జరిగిన నంద్యాల, కర్నూలు సమీక్షల సందర్భంగానూ ఇదే సీన్ రిపీట్ అయ్యిందని సమాచారం. చంద్రబాబు ఎప్పటి లాగే సర్వేల పాట పాడారని అంటున్నారు.

మైండ్ గేమ్ ఆడటంలో చంద్రబాబును మించినవారు లేరనేది పరిశీలకుల మాట. ఇప్పుడు ఆయన విచిత్రంగా వైఎస్ఆర్ సీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే చేశారని చెబుతున్నారు. అసలు తాను చేసే వ్యవహారాలు ఎదుటి పార్టీయే చేస్తోందని నమ్మించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, ఈసారి కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు.

నిజానికి పోలింగ్ ముగిసిన తరువాత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గెలుపు అంశాల మీద బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ బాబు మాత్రం ఇది వైఎస్ఆర్ సీపీ మైండ్ గేమ్ అంటున్నారు. రాష్ట్రంలోనే కాకుండా, జాతీయస్థాయికి చెందిన పలు సంస్థలు నిర్వహించిన పలు సర్వేలలో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని స్పష్టం చేస్తున్న విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వాటిని కొట్టి పడేస్తున్న చంద్రబాబు వైఎస్ఆర్ సీపీ మీద నేరుగా విమర్శలు ఎక్కు పెట్టడం గమనార్హం.

జగన్ మౌనంగా ఉంటుంటే చంద్రబాబు మాత్రం రోజూ ఏదో ఒకటి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ మీద విరుచుకు పడుతున్నారని అంటున్నారు. 2014 ఎన్నికల పరిస్థితులకూ, 20‌19 ఎన్నికల పరిస్థితులకూ చాలా తేడాలు ఉన్నాయని, ఈసారి గెలుపు వైఎస్ఆర్ సీపీదేననే చర్చ జనంలోనూ తీవ్రంగా ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించలేకపోతున్నారని అంటున్నారు. అసలు సంగతిని ఆయనకు వివరించాలని సహచరులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదని సమాచారం.