Telugu Global
NEWS

ఐపీఎల్ అసలుసిసలు విజేత వాట్సన్

రక్తం కారుతున్నా పోరాటం కొనసాగించిన ఓపెనర్  చెన్నై ఓడినా అభిమానుల హృదయాలు గెలుచుకొన్న వాట్సన్  33 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్న షేన్ వాట్సన్ ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. ముంబై ఇండియన్స్ నాలుగోసారి టైటిల్ గెలుచుకొన్నా… అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది మాత్రం.. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ మాత్రమే. గతంలో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ లాంటి జట్లకు ఆడిన వెటరన్ వాట్సన్ గత రెండు సీజన్లుగా… మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. […]

ఐపీఎల్ అసలుసిసలు విజేత వాట్సన్
X
  • రక్తం కారుతున్నా పోరాటం కొనసాగించిన ఓపెనర్
  • చెన్నై ఓడినా అభిమానుల హృదయాలు గెలుచుకొన్న వాట్సన్
  • 33 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్న షేన్ వాట్సన్

ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. ముంబై ఇండియన్స్ నాలుగోసారి టైటిల్ గెలుచుకొన్నా… అభిమానుల హృదయాలు కొల్లగొట్టింది మాత్రం.. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ మాత్రమే.

గతంలో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ లాంటి జట్లకు ఆడిన వెటరన్ వాట్సన్ గత రెండు సీజన్లుగా…
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు.

మ్యాచ్ విన్నర్ షేన్ వాట్సన్….

ఐపీఎల్ 2018 సీజన్ వేలంలో 4 కోట్ల రూపాయల ధరకు వాట్సన్ ను చెన్నై ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది. ఓపెనర్ గా జట్టులోకి తీసుకొంది. దానికి ప్రతిగా వాట్సన్ చెన్నై తరపున తొలిసీజన్లోనే టైటిల్ అందించాడు.

హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన టైటిల్ సమరంలో చెన్నై ఓపెనర్ గా వాట్సన్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 57 బాల్స్ లోనే 8 సిక్సర్లు, 11 బౌండ్రీలతో సహా 117 పరుగుల నాటౌట్ స్కోరుతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 205.26 స్ట్రయిక్ రేట్ తో వావ్ అనిపించాడు.

చెన్నై టైటిల్ విజయంలో ప్రధానపాత్ర వహించడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్స్ అవార్డు సైతం వాట్సన్ సొంతం చేసుకొన్నాడు.

2019 ఫైనల్లోనూ అదే జోరు…

క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియా జాతీయజట్టులో ప్రధాన సభ్యుడిగా కొనసాగిన వాట్సన్ ఆ తర్వాత దశల వారీగా తన జట్టుకు దూరమయ్యాడు.

తమ దేశంలో జరిగే బిగ్ బాష్ లీగ్ తో పాటు ఐపీఎల్ కు మాత్రమే ఆడుతూ కేవలం టీ-20 స్పెషలిస్ట్ గానే కొనసాగుతున్నాడు.

ప్రస్తుత 2019 సీజన్లో వాట్సన్ మొదటి 11 మ్యాచ్ ల్లో దారుణంగా విఫలమైనా…కెప్టెన్ ధోనీ మాత్రం తుదిజట్టులో కొనసాగిస్తూ వచ్చాడు.

ధోనీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాట్సన్ ఆ తర్వాత నుంచి పుంజుకొని ఆడాడు. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ 12వ రౌండ్ మ్యాచ్ నుంచి తనదైన శైలిలో చెలరేగిపోతూ ఆడాడు.

ఢిల్లీ పై స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ..

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండో క్వాలిఫైయర్ లో వాట్సన్ స్ట్రోక్ పుల్ హాఫ్ సెంచరీ సాధించాడు.అంతటితో ఆగిపోకుండా… ఫైనల్లోనూ తన తడాఖా ఏంటో ముంబై బౌలర్లకు రుచి చూపించాడు.

టాపార్డర్లో మిగిలిన ఆటగాళ్లు విఫలమైనా తన పోరాటం కొనసాగించాడు. సిక్సర్లు, బౌండ్రీల మోతతో ముంబై గుండెల్లో గుబులు పుట్టించాడు.

మోకాలి గాయంతోనే బ్యాటింగ్…

రెండో క్వాలిఫైయర్ ఆడుతున్న సమయంలోనే వాట్సన్ మోకాలికి గాయమయ్యింది. రక్తం గడ్డ కట్టి మోకాలు వాచినా… నొప్పి తెలియకుండా ఇంజక్షన్లు చేయించుకొని మరీ ఫైనల్లో బ్యాటింగ్ కు దిగాడు.

గాయానికి పట్టీలు వేయించుకొని మరీ బరిలోకి దిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో తన పోరాటం కొనసాగించాడు.
కేవలం 59 బాల్స్ లో 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 80 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. తన జట్టును విజయానికి చేరువగా తీసుకువచ్చి.. ఆఖరి ఓవర్ మిగిలి ఉండగా రనౌటయ్యాడు.

వరుసగా రెండో ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 2018 ఫైనల్లో 117 పరుగుల నాటౌట్ స్కోరుతో టాప్ స్కోరర్ గా నిలిచిన వాట్సన్…2019 ఫైనల్లో 80 పరుగులు సాధించడం విశేషం.

వాట్సన్ కు అభిమానుల హ్యాట్సాఫ్…

ఐపీఎల్ ఫైనల్స్ ముగిసిన అనంతరం వాట్సన్ తన కాలిగాయానికి చికిత్స చేయించుకొన్నాడు. కాలిగాయానికి ఆరుకుట్లు వేయించుకొన్నాడు.

గాయం నుంచి రక్తం కారుతున్నా ఫైనల్లో బ్యాటింగ్ కొనసాగించడం ద్వారా ఆటపట్ల ప్రేమ, అంకితభావాన్ని చాటుకొన్నాడు.
వాట్సన్ గాయం గురించి, ఆరుకుట్లు వేయించుకొన్న సంగతిని చెన్నై జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టాడు.

వాట్సన్ గాయంతోనే బ్యాటింగ్ కొనసాగించడం ద్వారా ముంబై ఇండియన్స్ అభిమానుల మనసులను సైతం గెలుచుకోగలిగాడు.

క్రికెటర్ అంటే వాట్సన్ లా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా ప్రముఖులు, పలువురు అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు.
వావ్… వాట్సన్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు.

2019 ఐపీఎల్ విజేతగా ముంబై నిలిచినా…అసలు సిసలు విజేతగా మాత్రం చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ నిలిచిపోయాడు.

First Published:  14 May 2019 5:50 AM GMT
Next Story