ఎన్టీఆర్ బయోపిక్ పై తేజ రియాక్షన్

అన్నీ అనుకున్నట్టు జరిగితే తేజ దర్శకత్వంలో రావాల్సిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఆ సినిమా ప్రారంభోత్సవంలో కూడా తేజ ఉన్నాడు. సెట్స్ పైకి వెళ్లేసరికి మాత్రం డ్రాప్ అయ్యాడు. ఆ సినిమా మిస్ అయిన తర్వాత ఇప్పటివరకు దానిపై స్పందించని తేజ ఎట్టకేలకు బయోపిక్ పై రియాక్ట్ అయ్యాడు.

“ఎందుకో ఎన్టీఆర్ సినిమాను నేను హ్యాండిల్ చేయలేనని అనిపించింది. ఎన్టీఆర్ జీవితాన్ని కథగా మార్చి సినిమాగా మలిచేంత సత్తా నాకు లేదనిపించింది. అందుకే ఆ ప్రాజెక్టు నుంచి నేను తప్పుకున్నాను. పైగా నా అభిమాన నటుడు ఎన్టీఆర్. అతడి జీవితాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు నేను కచ్చితంగా ఎమోషనల్ గా బ్యాలెన్స్ తప్పుతాను. అందుకే తప్పుకున్నాను.”

టీవీ9కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్ అయ్యాడు తేజ. అంతేకాదు, బయోపిక్ కు సంబంధించి విడుదలైన 2 సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదని, కనీసం ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదంటున్నాడు తేజ.

“అసలే నేను స్ట్రయిట్ గా మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. బయోపిక్ చూసిన తర్వాత కచ్చితంగా అందులో ఫ్రేమ్స్ నేను కంపార్ చేస్తాను. ఎవరో ఒకరి దగ్గర మాట్లాడతాను. మళ్లీ అదో వివాదం. ఈ తలనొప్పులన్నీ ఎందుకని ఏకంగా సినిమానే చూడడం మానేశాను.”

తను అనుకున్న అవుట్ పుట్ వచ్చేంతవరకు కష్టపడతానని, అవసరమైతే ఔట్ పుట్ కోసం నటీనటుల్ని కొడతానని అంటున్న తేజ.. తనకున్న ఈ అలవాటు వల్ల సినిమా ఛాన్స్ మిస్ అవ్వలేదని స్పష్టంచేశాడు. లక్షలాది మంది అభిమానులున్న బాలయ్యను కొట్టేంత సీన్ తనకు లేదన్నాడు.