అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు?

“గెలుపు కాదు మార్పు మనకు ముఖ్యం. ఈ ఎన్నికలలో అది సాధించాం” ఇటీవల విజయవాడలో జరిగిన జనసేన అభ్యర్థులు సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాటలివి. ఇదిగో ఈ మాటల మీదే జనసేన అభ్యర్థులు మండిపడుతున్నారు.

గెలుపు ముఖ్యం కాదు అనుకుంటే శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో మా చేత ఎందుకు పోటీ చేయించారని తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఎన్నికలలో జనసేన అభ్యర్థులు ఇతర పార్టీలతో పోలిస్తే తక్కువ గానే ఖర్చు చేసినా… తమ స్థాయికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

గడచిన రెండు సంవత్సరాలుగా పర్యటనల కోసం ఖర్చు చేసింది… ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చు చేసింది ఎన్నికలలో విజయం సాధించేందుకు కాక మరి ఎందుకు చేశామని ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు వింటే ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవికి, ఈయనకు తేడా లేదని అర్థమవుతోందని అంటున్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఓటమి గురించి ప్రస్తావించరని, ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఓటమిపాలైనా పర్వాలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల్లో ఓటమి కొని తెచ్చుకునేందుకు ఇన్ని డబ్బులు ఖర్చు చేయడం అవసరమా…? అని జనసేన అభ్యర్థులు లోలోన మదన పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని కచ్చితంగా తెలిసినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం విజయం తధ్యమని పార్టీ శ్రేణులకు చెబుతున్నారని, తమ నాయకుడు అందుకు విరుద్ధంగా జనసేనకు ఓటమి తప్పదు అంటూ వ్యాఖ్యానించడం సరైంది కాదని అంటున్నారు.

మార్పు తీసుకు రావడం ముఖ్యం అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి మార్పు తీసుకు వచ్చారో చెప్పగలరా..? అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు అన్నా… ఎన్నికలలో పోటీ చేయడం అన్నా వెండితెరపై డైలాగులు చెప్పినట్లు కాదని, ఈ చెప్పే నీతులు ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే తాము పోటీకి దూరంగా ఉండేవాళ్లమని కొందరు అభ్యర్థులు సమీక్ష సమావేశం అనంతరం సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.