డబ్బింగ్ పై ప్రభాస్ క్లారిటీ

సాహో సినిమాకు సంబంధించి చాలా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు బయటకొస్తున్నాయి. కానీ ఈ సినిమా డబ్బింగ్ కు సంబంధించి మాత్రం ఓ క్లారిటీ మిస్ అయింది. తెలుగు-హిందీ భాషల్లో సమాంతరంగా తెరకెక్కుతున్న సాహో సినిమాకు సంబంధించి, హిందీలో ఎవరు డబ్బింగ్ చెబుతారనేది అసలైన డౌట్. ఎట్టకేలకు ఈ సందేహానికి సమాధానం ఇచ్చాడు ప్రభాస్.

“నిజమే బాహుబలి సినిమాకు నేను హిందీలో డబ్బింగ్ చెప్పలేదు. కానీ సాహోకు మాత్రం నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాను. నెల రోజుల నుంచి సోనీ అనే టీచర్ దగ్గర హిందీ నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం నేను హిందీ బాగా మాట్లాడతాను. డబ్బింగ్ కూడా చెప్పుకుంటాను.” బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు ప్రభాస్.

బాహుబలి సిరీస్ కు ఏమాత్రం తగ్గని విధంగా హాలీవుడ్ రేంజ్ లో సాహో సినిమా ఉంటుందని ప్రకటించిన ప్రభాస్.. దయచేసి బాహుబలికి సాహోకు కంపారిజన్స్ తీసుకురావద్దని కోరుతున్నాడు.

బాహుబలి, సాహో సినిమాల జానర్లు ఒకదానితో ఒకటి సంబంధం లేదన్న ప్రభాస్.. బాహుబలి సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటే, సాహో సినిమాలో స్క్రీన్ ప్లే డామినేట్ చేస్తుందని చెబుతున్నాడు. ఓ హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం వస్తుందని భరోసా ఇస్తున్నాడు.