వీహెచ్‌ లొల్లి…. ధర్నాలో నగేష్‌

లొల్లి చేసింది ఒకరు.. కొట్టుకుంది ఇద్దరు.. కానీ ఒక్కరిపైనే సస్పెన్షన్ వేటు పడింది. వీహెచ్ మొన్న ఇందిరాపార్క్ వద్ద అంత రచ్చ చేసినా ఆయనపై సస్పెన్షన్ వేటు పడలేదు.. ఆయన నోరు పెద్దది కావడం.. జాతీయస్థాయిలో పరిచయాలు ఉండడంతో వీహెచ్ పై చర్య తీసుకోకుండా కేవలం నగేష్ పై వేటు వేసి కాంగ్రెస్ ఈ సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

ఇటీవల ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నేతల కుర్చీల కొట్లాటపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని నిర్ధారిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి నగేశ్ ముదిరాజ్ ను సస్పెండ్ చేసింది. అయితే అక్కడితో ఆ వివాదం ముగిసిపోతుందని అంతా భావించారు. ఇక్కడే ట్విస్ట్ తీసుకుంది.

రెండు రోజుల కింద ఇందిరాపార్క్ ఎదుట ఇంటర్ ఫలితాలతో విద్యార్థుల ఆత్మహత్యలు-ప్రభుత్వ వైఫల్యంపై అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో కుర్చీ కూడా తనకు కేటాయించలేదని .. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని వీ హనుమంతరావు రెచ్చిపోయారు. కాంగ్రెస్ అధిష్టానం దూత కుంతియా ముందే చెడుగుడు ఆడారు. వీడియో కెమెరాల్లో వీహెచ్ చేసిన రచ్చే ఎక్కువ హైలెట్ అయ్యింది. నగేష్ పై వీహెచ్ దాడి చేసిన దృశ్యాలు కనిపించాయి.

అయితే ఈ దాడిలో వీహెచ్ ఎంత రచ్చ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నగేష్ నే సస్పెండ్ చేయడం విశేషం.

అయితే తనపై అకారణంగా సస్పెన్షన్ విధించారని.. దీనిపై తాను కోర్టుకు వెళతానని నగేష్ స్పష్టం చేశారు. వీహెచ్ కూడా తనను కొట్టారని.. ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఉద్దేశపూర్వకంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు. ఇక తనను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ఎదుట నగేష్ ధర్నాకు దిగారు. ఇలా సద్దుమణుగుతుందనుకున్న వ్యవహారం నగేష్ ఆందోళనలతో ముదిరిపాకాన పడుతోంది.