చంద్రబాబు…. అదే తీరు

ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం చేపట్టగలమని టీడీపీ అధినేత చంద్రబాబు గట్టిగానే నమ్ముతున్నట్టున్నారు. ఆయన వేసే అడుగులు, మాట్లాతున్న మాటలు ఈ విషయాన్ని స్ఫష్టం చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మంగళవారం కేబినేట్ భేటీ తరువాత మంత్రులతో ఇష్టాగోష్టీగా మాట్లాడిన చంద్రబాబు విజయం తమదేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారట. పేద ప్రజలు తమ వెంట ఉండడమే దీనికి కారణమని, సంక్షేమ పథకాలే తమ గెలుపునకు బాటలు వేశాయని చెప్పుకొచ్చారట.

చివరి మూడు నెలల్లోనే కొట్లాది రూపాయల విలువ చేసే పథకాలు లబ్ధిదారులకు అందాయని, వారంతా తమకే ఓట్లు వేసే అవకాశాలున్నాయని ఓ మంత్రి కూడా చంద్రబాబు దృష్టికి తెచ్చారనే వార్తలు వచ్చాయి.

అయితే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చెబుతున్న మాటలను, కిందిస్థాయి నేతలు ఇస్తున్న నివేదికలను, జనంలో జరుగుతున్న చర్చలను మాత్రం చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు.

ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందనీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చాలా మంది టీడీపీ అభ్యర్థులు స్వయంగా తమ గెలుపు అవకాశాల మీద పెదవి విరుస్తున్నారు.

చంద్రబాబు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ హడావుడిని చూసే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, జాతీయస్థాయి నాయకులు నిజంగానే ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందేమోనని భావిస్తున్నారని అంటున్నారు. వారు అలా అనుకోవాలన్నదే బాబు అభిమతమని కూడా చెబుతున్నారు.

ఎన్నికలలో గెలవడానికి చివరి నిమిషంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మాత్రమే పని చెయ్యవని, ఇంకా అనేకానేక అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారని, ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదని అంటున్నారు.

జగన్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహను కూడా ఆయన భరించలేకపోతున్నారని, అందుకే మాటి మాటికీ టీడీపీదే విజయం అంటూ మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వైపు మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశానికి యనమల రామకృష్ణుడు వంటి కీలక మంత్రులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.