తెలంగాణ తెర వెనుక ఏం జరుగుతోంది?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రాల పర్యటన ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావానికి ఎలాంటి ఊతం ఇస్తుందో తెలియదుగానీ, జాతీయ రాజకీయాలకు సంబంధించి తెర వెనుక మాత్రం ఏదో జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీఆర్ దాదాపుగా ప్రతి అంశంలోనూ గుంభనంగా వ్యవహరిస్తారు. అంత తొందరగా బయటపడే రకం కాదు. కనీసం తన ముఖ కవళికల ద్వారా అయినా ఆయన మనసులో ఏముందో  అంచనా వేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. అలాంటిది ఆయన కేరళ ముఖ్యమంత్రి విజయన్ ను కలిసిన తరువాత కూడా మీడియాతో పెద్దగా మాట్లాడ లేదు. తనను కలవడానికి తొలుత నిరాకరించిన తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్ చివరకు కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

దీంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలను స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారని, ఫలితాల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచించుకుందామని చెప్పి పంపించారని వార్తలు వచ్చాయి. అటు తమిళనాడులో అన్నా డీఎంకే బలహీనపడుతోందని సమాచారం.

ఎంపీ సీట్లను డీఎంకేనే ఎక్కువగా గెలుచుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్టాలిన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఇటు వీరిద్దరి భేటీ ఇలా ముగిసిందో.. లేదో అటు మరింత ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. డీఎంకే త్వరలోనే బీజేపీతో కలిసి నడవబోతోందని, ఇందుకు స్టాలిన్ సూత్రప్రాయంగా అంగీకరించారనే వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలను తమిళనాడు బీజేపీ శాఖ కూడా ధృవీకరించిందని అంటున్నారు.

స్టాలిన్ తమతో టచ్ లో ఉన్న మాట నిజమేనని కొందరు బీజేపీ నాయకులు కూడా అంగీకరించారనే మాటలు వినిపించాయి. అయితే ఈ అంశాలన్నింటిని స్టాలిన్ గట్టిగానే ఖండించారు. తాను బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నేతలతో తాను టచ్ లో ఉన్నానని నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని, నిరూపించలేకపోతే మోడీ తప్పుకుంటారా అంటూ సవాల్ విసిరారు. దీని మీద బీజేపీ ఇంత వరకు స్పందించలేదు.

ఈ అన్ని పరిణామాలను గమనిస్తుంటే తెర వెనుక ఏదో భారీ వ్యూహానికే రూపకల్పన జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఫలితాల తరువాత అందరూ ఆశ్చర్యపడే విధంగా కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వచ్చే అవకాశాలను కొట్టి పడవేయలేమని అంటున్నారు.