ఏడాదిలో 130 ప్రాజెక్టులను పూర్తి చేసిన ‘మేఘా’

మౌలిక సదుపాయాల రంగంలో దేశంలోనే పేరుగాంచిన సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గత ఆర్థిక సంవత్సరంలో 130కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసి మరోసారి, రికార్డు సృష్టించి తన సత్తా చాటుకుంది.

నిర్థేశించిన గడువులోగా, నాణ్యతతో పనులు పూర్తిచేయడంలో ముందుండే మేఘా సంస్థ గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా విభిన్న ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇందులో ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, గ్యాస్ ప్రాసెసింగ్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మొదలైన ప్రాజెక్టులు ఉన్నాయి.

ఏడు నెలల్లో రెండు రికార్డులు

కేవలం ఏడు నెలల్లో ఎన్‌పీ కుంట సబ్ స్టేషన్ ను పూర్తి చేసినందుకు గానూ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఇటీవల మేఘా స్థానం దక్కించుకుంది. కెయిర్న్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కోసం రాజస్థాన్ లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ ప్రాజెక్టును మేఘా చేపట్టి, కేవలం ఆరునెలల రికార్డ్ సమయంలో పూర్తిచేసింది. సెప్టెంబర్ 2018లో పనులు ప్రారంభించగా, 2019 మార్చిలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది.

గుజరాత్‌లో….

గుజరాత్ లో అనేక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిన మేఘా తాజాగా సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ పై 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత ఏడాదిలో రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. మూడో జలవిద్యుత్ కేంద్రం పనులన్నీ పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.

మేఘా పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తిస్థాయి ప్రాజెక్టులు కాగా మరికొన్ని ప్రాజెక్టులలో భాగమైన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తారు.

కర్ణాటకలో….

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం ఒక ప్రాజెక్టును చేపట్టి సకాలంలో పూర్తి చేసింది. నదీ జలాలను సేకరించి థర్మల్ విద్యుత్‌ ప్లాంటుకు పంపింగ్ చేయడం, బూడిదతో కూడిన నీటిని యాష్‌ బండ్ కు తరలించడం, అక్కడి నుంచి నీటిని తిరిగి సేకరించి ప్లాంటుకు పంపడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మేఘా జాక్ వెల్, పంప్ హౌజ్, పైప్ లైన్ లను ఏర్పాటు చేసింది.

తెలంగాణలో….

కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించే లిక్-1కు చెందిన నాలుగు సబ్ స్టేషన్ లను గత ఏడాది మేఘా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాకేజీ-8లో ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు ఏడింటికి విద్యుత్ ను అందించే రామడుగు సబ్ స్టేషన్ ను తొలుత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 400/220 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్, 220 కేవీ అన్నారం సబ్ స్టేపన్, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నెల్లూరులో తాగునీటి సరఫరా పథకం….

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి, సమీప గ్రామాల్లోని 70 వేల ఇళ్లకుతాగునీటిని అందించేందుకు మేఘా నెల్లూరు తాగునీటి సరఫరా పథకాన్ని చేపట్టింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు నల్గొండ, మంగపేట, పాలేరు వరంగల్, దుమ్ముగూడెం, అదిలాబాద్ ఫేజ్ 1, 2 సెగ్మెంట్లను పూర్తిచేసి, తాగునీటిని సరఫరా చేస్తున్నది.

ఒడిషాలో, ఉత్తరప్రదేశ్ లలో….

అదేవిధంగా కర్ణాటకలోని దాసరహళ్లి, రాజస్థాన్ లోని కోట్రీ, అసింధ్, పాలి, షాపుర ప్రాజెక్టులు, ఒడిషాలోని భువనేశ్వర్ బల్క్, కియోన్జహార్ ప్రాజెక్టులతోపాటు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ఆగ్రా ప్రాజెక్టులను పూర్తి చేసింది.

సాగునీటి సరఫరా ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో పురుషోత్తపట్నం, కొండవీటివాగు, హంద్రీనీవా ఫేజ్-2, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసింది. కర్ణాటకలో కోలార్, కన్వ, ఉత్తూర్ ప్రాజెక్టులు, ఒడిషాలో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లోని ఆరు లిఫ్ట్ లను కమిషన్ చేసింది. విద్యుత్ సబ్ స్టేషన్లలో కలిగిరి, పొదిలి-సత్తెనపల్లి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం సబ్ స్టేషన్లతో పాటు నర్సాపూర్ లిలో లైన్ ను సకాలంలో పూర్తి చేసింది.