స్పీడు పెంచిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవనే నిర్ధారణకు వచ్చిన కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటుగా, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగడం విశేషం.

కాంగ్రెస్ పార్టీని అధికార పీఠానికి దగ్గర చేసేందుకు ఆమె అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించారని అంటున్నారు. వివిధ పార్టీలు తమకు మద్దతు ఇచ్చేలా ఒప్పించడమే కాకుండా, రాహుల్ ప్రధాని అయ్యే మార్గాన్ని కూడా ఆమె సుగమమం చేస్తున్నారని చెబుతున్నారు.

అదే సమయంలో, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసేలా తాము ప్రధాని పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని ఆయా పార్టీలకు సంకేతాలు పంపుతున్నారట. ప్రాంతీయ పార్టీలను తమవైపు ఆకర్షించేందుకు వీలుగా వారితో సంప్రదింపులు జరపాలని సోనియా నిర్ణయించినట్టు తెలిసింది.

ఆయా పార్టీల అధినేతలు, కీలక నాయకులతో మాట్లాడే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమలనాథ్, గులాం నబీ ఆజాద్, వీరప్పమొయిలీ లాంటి నాయకుల మీద ఉంచినట్టు సమాచారం. వారు ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారని అంటున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డితో, తెలంగాణలో కేసీఆర్ తో, ఒడిశాలో నవీన్ పట్నాయక్ తో ఆయా నేతలు సంప్రదింపులు జరుపుతారని తెలిసింది.

మమత వద్దకు కూడా ప్రత్యేక రాయబారాలు పంపించారని అంటున్నారు. అటు ఢిల్లీలోనూ కేజ్రీవాల్ ను శాంత పరిచేందుకు యత్నిస్తున్నారని చెబుతున్నారు. ఆప్ తో పొత్తు కుదిరే అవకాశాలు చివరి నిమిషంలో దూరమైన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎవ్వరినీ దూరం చేసుకోవద్దనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఏ అవకాశాన్ని కూడా వదలవద్దని తమ పార్టీ నేతలకు సూచిస్తున్నారట. ఫలితాలకు ముందుగానే ఆయా పార్టీలతో కమిట్మెంట్ తీసుకోగలిగితే, బీజేపీని దెబ్బ తీయవచ్చనేది సోనియా ఆలోచనగా చెబుతున్నారు.

ఎందుకంటే మెజారిటీ రాకపోతే బీజేపీ కూడా బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను దువ్వుతుంది. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని సోనియా భావిస్తున్నారట. మాజీ రాష్ట్రపతి, పూర్వపు కాంగ్రెస్ నేత ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ ప్రయత్నాలలో భాగస్వామి కావడం ఇందులో కొసమెరుపు.