ఇస్మార్ట్ శంకర్ టీజర్.. పూరి ఇక మారడంతే!

వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పటికీ పూరీ జగన్నాధ్ మాత్రం తన స్టయిల్ వీడలేదు. మేకింగ్ విషయంలో శరవేగంగా సినిమాలు పూర్తిచేయడంతో పాటు.. స్టయిల్ విషయంలో కూడా తనదైన పంథాలోనే దూసుకుపోతున్నాడు. పూరీ జగన్నాధ్ గత సినిమాలు ఎలా ఉన్నాయో, ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా అలానే ఉండబోతోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది ఈ సినిమా టీజర్.

రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్ గోల గోలగా ఉంది. గతంలో పూరి జగన్నాధ్ సినిమా టీజర్లు ఎలా ఉన్నాయో, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగానే ఉంది ఈ టీజర్. రామ్ ను మాస్ లుక్ లో చూపించే క్రమంలో ఏకంగా టీజర్ ను బూతు తోనే స్టార్ట్ చేశాడు పూరి జగన్నాధ్.

కొంతమందికి ఈ టీజర్ నచ్చితే, మరికొంతమంది మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. ఓ పోకిరి, ఓ బుజ్జిగాడు, ఓ పైసావసూల్ స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు అందుకున్నారు. అయితే టీజర్ కు సంబంధించి అంతా కామన్ గా ఒప్పుకున్న ఎలిమెంట్ మాత్రం ఒకటుంది. అదే మణిశర్మ మ్యూజిక్.

అవును.. టీజర్ లో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు, అతడు కంపోజ్ చేసిన థీమ్ సాంగ్ అందరికీ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి గోవాలో షూటింగ్ నడుస్తోంది. పాటల షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.