దక్షిణాది కీలకం.. ప్రధానిని నిర్ణయించేది ఈ పార్టీలే

దేశంలో జాతీయ పార్టీల పని అయిపోయింది. 2019 అంతా ప్రాంతీయ పార్టీలదే. ఈసారి దేశ ప్రధానిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు ఉత్తర భారతంపైనే నమ్ముకొని రాజకీయాలు చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ఇప్పుడు దక్షిణాది సత్తా తెలిసివచ్చింది. దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లోని పార్టీల మద్దతే దేశంలో ప్రధాని ఎవరనేది నిర్ణయించబోతున్నారు.

ఉత్తర భారతం అంతా ఈసారి కాంగ్రెస్, బీజేపీలకు చెరిసగం సీట్లు వస్తాయన్న అంచనాలున్నాయి. దీంతో దక్షిణాది పార్టీలే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. టీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, డీఎంకే, అన్నాడీఎంకే, జేడీఎస్, కేరళలోని కమ్యూనిస్టులు ఎటు వైపు మొగ్గు చూపితే వారిదే కేంద్రంలో అధికారం.

ఫెడరల్ ఫ్రంట్ పేరిట ఇప్పటికే కేసీఆర్, జగన్ ఒక్కమాట మీద ఉన్నారు. ఫలితాలు వెలువడ్డాక వీరి కోరిక నెరవేరాలంటే ఉత్తర ప్రదేశ్ లో జట్టుకట్టిన ఎస్పీ-బీఎస్సీ కలిసి వస్తే ఫెడరల్ ఫ్రంట్ ఆశలు నెరవేరుతాయి. ఒకవేళ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపే కేసీఆర్, జగన్ నిలిచే అవకాశాలున్నాయి.

ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యానే ప్రాంతీయపార్టీలన్నీ దేశంలో అధికారం చేపట్టే కాంగ్రెస్ లేదా బీజేపీకి మద్దతునిచ్చి తమ అవసరాలు తీర్చుకోవాలని..కేంద్రంలో చక్రం తిప్పాలని యోచిస్తున్నాయి. ఇక డీఎంకే, అన్నాడీఎంకే సహా కేరళ కమ్యూనిస్టులు కూడా కాంగ్రెస్ వెంటే ఉన్నారు. మొత్తం గా ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కంపల్సరీగా మారింది. ఇవి డిసైడ్ చేసే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయంగా మారింది.