డైలమాలో చంద్రబాబు…. జగన్, కేసీఆర్ వైపు చూస్తున్న కాంగ్రెస్!

మరో వారం రోజుల్లో కేంద్రం, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలిసిపోతుంది. ఏపీలో వైసీపీకి అధికారమని అనేక సర్వేలు, విశ్లేషణలు తెలిపాయి. కానీ కేంద్రంలో మాత్రం ఎవరికి స్పష్టమైన మెజార్టీ వస్తుందో తెలియడం లేదు. ఇక కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకుంటున్న సీఎం చంద్రబాబుకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది.

కేంద్రంలో యూపీఏ లేదా ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ రాకుంటే తన నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని అనుకున్నారు. అందుకే ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఢిల్లీ, కోల్‌కత చక్కర్లు కొట్టారు. అయితే, 6 దశల పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రంలో అధికారం పొందాలంటే టీఆర్ఎస్, వైసీపీ, డీఎంకేల మద్దతు తప్పని సరి అని తెలిసిపోయింది.

డీఎంకే అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కూటమిలోనే ఉంది. దీంతో యూపీఏలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్.. కేసీఆర్, జగన్‌లను తమ వైపు తిప్పుకోవాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీల చేతిలో కనీసం 30 నుంచి 35 ఎంపీ సీట్లు ఉండే అవకాశం ఉండటంతో రాహుల్ ఈ స్కెచ్ గీశారట.

అయితే.. ఈ విషయం చంద్రబాబు చెవిలో పడటంతో ఆయన డైలమాలో పడ్డాడట. టీడీపీకి కనీసం 15 సీట్లైనా రాకపోతే కాంగ్రెస్ కూటమిలో తన మాట చెల్లదని…. అంతే కాకుండా ఏ కూటమిలో కూడా చేరే అవకాశం ఉండదని ఆయన బాధపడుతున్నాడట.

ఒక వేళ కేసీఆర్, జగన్‌లు కాస్తా యూపీఏకు దగ్గరైతే తన పరిస్థితి ఏంటా అని ఆయన ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి 23 తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.