ర‌వి ప్ర‌కాష్‌పై మ‌రో కేసు న‌మోదు !

టీవీ 9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్‌ పై మ‌రో కేసు న‌మోదైంది. టీవీ 9 లోగోను 99 వేల రూపాయల‌కు అమ్మిన‌ట్లు ఆయ‌న‌పై అలందా మీడియా డైరెక్ట‌ర్ కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్‌తో పాటు మాజీ సీఎఫ్‌వో మూర్తిపై కేసు న‌మోదు చేశారు.

మోజో టీవీ ఎండీ హ‌రికిర‌ణ్‌కు టీవీ 9 లోగోను 99 వేల రూపాయ‌ల‌కు ర‌విప్ర‌కాష్ అమ్మిన‌ట్లు అలందా మీడియా కంపెనీ ఆరోపిస్తోంది. ఈమేర‌కు ర‌విప్ర‌కాష్‌ ఎలాంటి లావాదేవీలు న‌డిపారు? టీవీ 9 ఆఫీసు నుంచి ఏఏ కుట్ర‌లు చేశారో ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

టీవీ9 ఆఫీసులో త‌న కంప్యూట‌ర్ హార్డ్ డిస్క్‌లో ఎలాంటి స‌మాచారం లేకుండా ర‌వి ప్ర‌కాష్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. అందులోని స‌మాచారం మొత్తం డిలీట్ చేయించాడు. కానీ స‌ర్వ‌ర్‌లో తాను న‌డిపిన మెయిల్స్ అన్నీ రికార్డు అయ్యాయి. వాటిని వెలికితీసిన సైబ‌ర్ క్రైమ్ విభాగం అధికారులు ర‌విప్ర‌కాష్ కుట్ర‌ల‌ను బ‌య‌టపెడుతున్నారు.

మోజో టీవీలో ర‌విప్ర‌కాష్ భాగ‌స్వామ్యం ఉంది. మీడియా నెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో మోజో టీవీ న‌డుస్తోంది. అయితే డైరెక్టుగా ఆయ‌న ప్ర‌మేయం లేకుండా…త‌న బినామీల‌ను ఇక్క‌డ చేర్పించారని చెబుతున్నారు. టీవీ 9 నుంచి ఈ మోజో టీవీకి నిధులు మ‌ళ్లించార‌ని ర‌విప్ర‌కాష్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ ఆరోప‌ణ‌ల‌పై రెండు కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా మ‌రో కేసు న‌మోదు కావ‌డంతో ర‌విప్ర‌కాష్‌ చ‌క్ర‌బంధంలో చిక్కుకున్నారు.

మొత్తానికి ర‌విప్ర‌కాష్ కేసుల ఉచ్చు బిగుస్తోంది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని కేసులు ఆయ‌న‌పై న‌మోదు అయ్యే అవ‌కాశం ఉందని అంటున్నారు. దీంతో అజ్ఞాతంలో ఉన్న ర‌విప్ర‌కాష్ బ‌య‌ట‌కు వ‌స్తారా? త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెబుతారా? అనేది చూడాలి.