రెడ్డి గారి అబ్బాయ్ గా మహేష్ బాబు !

రేపు మహర్షి సినిమాకు సంబంధించి భారీ సక్సెస్ మీట్ ఏర్పాటుచేస్తున్నారు. బెజవాడలోని సిద్దార్థ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ సినిమా సక్సెస్ మీట్ జరుగుతోంది. మహర్షి సినిమాకు సంబంధించి ఆఖరి ప్రచార కార్యక్రమం ఇదే కానుంది.

సినిమా విడుదలై ఆల్రెడీ వారం రోజులు దాటేసింది కాబట్టి, సక్సెస్ మీట్ తర్వాత ఇక ప్రచారాన్ని ఆపేయాలని యూనిట్ నిర్ణయించుకుంది. అటు మహేష్ మాత్రం బెజవాడ ఈవెంట్ తర్వాత ఇక అందుబాటులోకి రానని గట్టిగా చెప్పేశాడు. ఎందుకంటే మహర్షి పనులన్నీ అయిన వెంటనే ఆయన తన నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేయాలి.

అవును.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వీలైనంత త్వరగా సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నాడు మహేష్. ఈ సినిమాను తొందరగా పూర్తిచేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయ్’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తన సినిమాలకు ఎప్పుడూ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు అనీల్ రావిపూడి. ఈసారి మాత్రం మహేష్ కోసం తన స్టయిల్ మార్చుకున్నాడు. అచ్చతెలుగు టైటిల్స్ కోసం వెదుకుతున్నాడు. ఈ క్రమంలో ‘రెడ్డిగారి అబ్బాయ్’ అనే పేరు తెరపైకి వచ్చింది. త్వరలోనే ఈ టైటిల్ ను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.