షేర్ చెప్పడానికి సిగ్గుపడుతున్న శిరీష్

నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది ఏబీసీడీ సినిమా. ఓవైపు మహర్షి సినిమా బలంగా నడుస్తుందనే విషయం తెలిసి కూడా ఏబీసీడీ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చారు. దీని కోసం సురేష్ బాబుతో ఒప్పందం పెట్టుకొని మరీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. అయితే ఇంత చేసినా అల్లు శిరీశ్ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు.
ఏబీసీడీ సినిమాకు మొదటి రోజు చాలా తక్కువ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్ హౌజ్ ఫుల్ అవ్వలేదు. దీనికి తోడు బ్యాడ్ టాక్ ఒకటి. దీంతో అల్లు శిరీష్ కెరీర్ లో మరో ఫ్లాప్ సినిమా వచ్చి చేరింది. వెన్నెల కిషోర్ వేసిన 2 పంచ్ లు మినహా సినిమాలో మరేం లేవనే విషయం జనాలకు అర్థమైపోయింది.
ఇంత నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఉన్నప్పుడు సైలెంట్ గా ప్రచారం చేసుకోవాలి. పెద్ద విజయం అంటూ కామ్ గా పోస్టర్లు వేసుకోవాలి. వీటికి ఎవరూ అడ్డుచెప్పరు. కానీ అల్లు శిరీష్ అక్కడితో ఆగలేదు. మొదటి రోజు వసూళ్లను ప్రకటించాడు. స్టార్ హీరోలు మాత్రమే చేసే పనిని అల్లు శిరీష్ చేశాడు. ఇంత చేసి ఈ హీరో ప్రకటించి మొత్తం ఎంతో తెలుసా. అక్షరాలా 2 కోట్ల పాతిక లక్షల రూపాయలు. అది కూడా షేర్ కాదు, గ్రాస్ ఎమౌంట్.
అసలే అల్లు శిరీష్ సినిమాలు అంతంతమాత్రంగా ఆడుతుంటాయి. ఇలాంటి టైమ్ లో మొదటి రోజు వసూళ్లు అంటూ పోస్టర్లు వదలడం అవసరమా. పోనీ పోస్టర్లు రిలీజ్ చేశాడనే అనుకుందాం. ధైర్యం ఉంటే షేర్లు చెప్పొచ్చు కదా. ఆ పని మాత్రం చేయలేదు.