బీజేపీ 200 సీట్లు దాట‌డం కష్టమేనా?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. ఆదివారం తుది ద‌శ పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్పుడు ఎవ‌రెవ‌రు ఎన్ని సీట్లు గెలుస్తారు అనే చ‌ర్చ మొద‌లైంది. ఆదివారం వెలువ‌డ‌బోయే ఎగ్జిట్‌పోల్ ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే అంచ‌నాలు ప్రారంభ‌మ‌య్యాయి.

బీజేపీ ఈసారి ఎన్ని సీట్లు గెల‌వ‌బోతుంద‌నేది ప్ర‌ధాన చ‌ర్చ‌. 2014లో బీజేపీకి 282 సీట్లు వ‌చ్చాయి. అయితే ఈ సారి ఎన్ని వ‌స్తాయి? త‌గ్గితే ఎన్ని సీట్లు త‌గ్గుతాయి. 200 మార్క్ దాటుతుందా? లేదా? యుపీలో క‌చ్చితంగా ఈ సారి సీట్లు తగ్గుతాయా? అయితే మ‌రి ఎక్క‌డ పెరుగుతాయి? ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌ను వేధిస్తున్నాయి.

2014లో బీజేపీతో క‌లిసి కూట‌మి క‌ట్టిన పార్టీలు ఇప్పుడు ఆ పార్టీతో లేవు. ఏపీలో టీడీపీ దూర‌మైంది. త‌మిళ‌నాడులో ఏఐఏడీఎంకేతో ఈ సారి పొత్తు కుదుర్చుకుంది. కేవ‌లం అక్క‌డ ఐదుసీట్ల‌లో పోటీ చేస్తోంది. అసోంలో ఏజీపీతో క‌లిసి ఈ సారి బ‌రిలోకి దిగింది. అయితే ఈ పొత్తులు ఈ సారి ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయో చూడాలి.

మ‌రోవైపు ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశా, హ‌ర్యానా, క‌ర్నాట‌క‌, త్రిపుర‌, కేర‌ళ‌…. ఈ ఆరు రాష్ట్రాల్లో త‌మ‌కు సీట్లు పెరుగుతాయ‌ని బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. ప‌శ్చిమ‌బెంగాల్‌లో బీజేపీ ప‌ది సీట్ల‌పై క‌న్నేసింది. యూపిలాగే ఇక్క‌డ సామాజిక స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. బెంగాల్‌లో 28 శాతం ముస్లిం జనాభా. దీంతో ఇత‌ర మ‌తాల ఓట్లను స‌మీక‌రించేందుకు బీజేపీ ప్లాన్ వేసింది. ఈ ప్ర‌ణాళిక వ‌ర్క్‌వుట్ అయితే ఇక్క‌డ బీజేపీ ప‌దికి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది.

ఒడిశాలో ప‌దిసీట్లు, త్రిపుర‌లో రెండు సీట్లు గెల‌వాల‌నేది బీజేపీ ప్లాన్‌. ఇక క‌ర్నాట‌క‌లో 2014 ఎన్నిక‌ల్లో 17 సీట్లు బీజేపీ గెలిచింది. అయితే ఈసారి ఇక్క‌డ 20కి త‌గ్గ‌కుండా గెల‌వాల‌ని చూస్తోంది. హ‌ర్యానాలో గ‌త ఎన్నిక‌ల్లో ఏడు సీట్లలో విజ‌యం సాధించింది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాల‌ని చూస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అందిన లెక్క‌ల ప్ర‌కారం ఈ ఆరు రాష్ట్రాల్లో 47సీట్ల‌ను బీజేపీ గెలుస్తుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇదే స‌మ‌యంలో మిగ‌తా రాష్ట్రాల్లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోబోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వ‌ల్ల సీట్లు కోల్పోవాల్సి వ‌స్తోంది. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ వెంట న‌డిచిన షెడ్యూల్ కులాల వారి మ‌ద్ద‌తు ఈ సారి త‌గ్గింద‌ని తెలుస్తోంది. దీంతో బీజేపీకి ఓట్ల శాతం త‌గ్గ‌డంతో పాటు భారీగా సీట్లు కోల్పోవాల్సి వ‌స్తోందట. మొత్తానికి బీజేపీ 200 సీట్లు దాట‌డం క‌ష్ట‌మే అని లెక్క‌లు చెబుతున్నాయి.