క్యాంపు రాజకీయాలకు సిద్ధమౌతున్న చంద్రబాబు

ఎన్ని సర్వేలు చేసినా.. ఎంత ధీమాగా చెబుతున్నా ఏపీలోని ఓటర్లు ఎవరివైపు మొగ్గారన్నది ఇప్పటికీ కొందరికి అంతుచిక్కడం లేదు. తమదే అధికారమని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జగన్‌ అయితే ఏమాత్రం టెన్షన్‌ లేకుండా చాలా నమ్మకంగా, కూల్‌గా ఉన్నాడు. అయితే కౌంటింగ్ రోజున ఫలితాలను బట్టి క్యాంప్ రాజకీయాలకు టీడీపీ పార్టీ తమ ఎమ్మెల్యేలను సిద్ధం చేస్తున్నది.

తాజాగా చంద్రబాబు ఏపీలో హంగ్ వస్తుందనే భయంతో క్యాంప్ లకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. చంద్రబాబు స్వయంగా మంత్రులతో ఈ విషయం పంచుకోవడంతో ఏపీలో హంగ్ పై తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.

అయితే క్యాంపులు నిర్వహించాలా వద్దా అనేది మే 19వ తేదీన నిర్ణయించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. ఆ రోజు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వస్తాయి. ఈ తేదీ కోసం జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తేడా స్వల్పంగా కనిపిస్తే మాత్రం క్యాంపులకు తెరదీయడం ఖాయమంటున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. అయితే ఒక్క లగడపాటి సర్వే మాత్రం ఘోరంగా విఫలమైంది. లగడపాటి సైతం మే 19న సర్వే ఫలితాలను వెల్లడిస్తానని తెలిపారు. జాతీయ మీడియా కూడా అదే రోజు వెలువరిస్తుంది.

దీంతో లగడపాటి-జాతీయ మీడియా మధ్యన ఏమాత్రం తేడా వచ్చినా లగడపాటిని నమ్మే స్థితిలో ఏపీ జనం లేరు. ఈసారైనా జెన్యూన్ గా ఇస్తారా లేదా అన్నది చూడాలి.

మొన్న డిసెంబర్ లో లగడపాటి తెలంగాణలో చేసిన సర్వే ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. టీడీపీ, వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయని.. జనసేన కూడా ప్రభావం చూపిందంటున్నారు. దీన్ని బట్టి హంగ్ రావచ్చన్న అంచనాకు వచ్చాయి టీడీపీ-జనసేన నాయకత్వాలు.