కరీబియన్ ప్రీమియర్ లీగ్ వైపు ఇర్ఫాన్ పఠాన్ చూపు

  • విదేశీ ప్రీమియర్ లీగ్ లో ఆడనున్న భారత తొలి క్రికెటర్ 
  • సెప్టెంబర్ 4 నుంచి కరీబియన్ ప్రీమియర్ టీ-20 లీగ్ 
  • 6 ఫ్రాంచైజీలో వేలంలో 536 మంది ఆటగాళ్లు

టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్…కరీబియన్ ద్వీపాలు వేదికగా సెప్టెంబర్ 4నుంచి ప్రారంభమయ్యే కరీబియన్ ప్రీమియర్ లీగ్ టీ-20 టోర్నీలో పాల్గొనటానికి ఉరకలేస్తున్నాడు. లీగ్ లో పాల్గొనటానికి అనుమతి కోరుతూ ఇప్పటికే తన దరఖాస్తును లీగ్ నిర్వాహకులకు పంపాడు.

536 మంది ఆటగాళ్ల పోటీ…

సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకూ జరిగే ఈ టోర్నీలో జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బార్బొడోస్, గయానా, ఆంటీగా, సెయింట్ లూకా ఫ్రాంచైల జట్లు ఢీ కొనబోతున్నాయి. ఈలీగ్ లో పాల్గొనటానికి..20 దేశాలకు చెందిన 536 మంది విదేశీ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు.

ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్లు అలెక్స్ హేల్స్, జోఫ్రా ఆర్చర్ ,అదిల్ రషీద్, బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, సౌతాఫ్రికా ఆల్ రౌండర్ జెపీ డుమ్నీతో సహా పలువురు విదేశీ క్రికెటర్లు ఈ లీగ్ బరిలోకి దిగబోతున్నారు.

విండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, డ్వయన్ బ్రావో,డారెన్ బ్రావో, హిట్ మేయర్, షియా హోప్ సైతం వివిధ ఫ్రాంచైజీల తరపున పోటీలో ఉన్నారు.

భారత తొలి క్రికెటర్ ఇర్ఫాన్…

విదేశీ క్రికెట్ లీగ్ లో పాల్గొనబోతున్న తొలి భారత క్రికెటర్ గా నిలవటానికి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఉరకలేస్తున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ కు…177 టీ-20 మ్యాచ్ ల్లో 173 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది.

2003 నుంచి 2012 వరకూ భారతజట్టు సభ్యుడిగా టెస్ట్, వన్డే, టీ-20 క్రికెట్ మ్యాచ్ ల్లో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్ లో సైతం పలు ఫ్రాంచైజీల తరపున ఆడాడు.

ఇంగ్లండ్ కౌంటీ మిడిల్ సెక్స్, ఐపీఎల్ లో..కింగ్స్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్ జట్ల కు ఆడిన అనుభవం ఇర్ఫాన్ పఠాన్ కు ఉంది.

ప్రస్తుత ఐపీఎల్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్ పట్ల ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో…విదేశీ లీగ్ ల వైపు ఇర్ఫాన్ చూపు మరల్చాడు. 34 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ ..2007 టీ-20 ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో సభ్యుడిగా సైతం ఉన్నాడు.