వరుసగా సినిమాలు విడుదల చేయబోతున్న మహేష్ బాబు

ఈ మధ్యనే ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తన కెరీర్ లోని 25వ సినిమా అయిన ‘మహర్షి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా మహేష్ బాబు ఇక నుండి తన సినిమాలను ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగానే అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని కూడా ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి మహేష్ బాబు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. మరో వైపు మహేష్ బాబు తన 27వ సినిమాని పరశురామ్ దర్శకత్వంలో ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను కూడా ఆరు నెలలలోపు పూర్తిచేసి విడుదల చేయాలని మహేష్ పరాశురాం కి డెడ్ లైన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే 2020 మొదట్లో మహేష్ బాబు అనిల్ రావిపూడి సినిమా విడుదల అవుతుండగా ఏడాది మధ్యలో లేదా ఆఖర్లో మహేష్ బాబు, పరాశురాం ల సినిమా విడుదల కాబోతోంది. అంటే వచ్చే ఏడాది రెండు సినిమాలతో మహేష్ బాబు కనువిందు చేయబోతున్నాడు అన్నమాట.