దేవరకొండ కెరీర్ లోనే భారీ చిత్రం

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు ఒకెత్తు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న మూవీ మరో ఎత్తు. అవును.. తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఆ సినిమా పేరు హీరో. అది రేపే గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో రేసర్ గా కనిపించబోతున్నాడు విజయ్ దేవరకొండ. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు. రేపు లాంఛనంగా ప్రారంభమైన వెంటనే ఢిల్లీలో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు.
ఈనెల 22 నుంచి ఢిల్లీలో బైక్ రేసింగ్ సీన్లు తీయబోతున్నారు. ఈ మేరకు రేస్ ట్రాక్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ షెడ్యూల్ లో విజయ్ పై 2 రేసింగ్ సన్నివేశాలు తీయాలనేది ప్లాన్. ఈ రెండు సన్నివేశాలకే 8 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కేవలం రేస్ ట్రాక్ అద్దెకే కోటికి పైగా చెల్లించినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ షెడ్యూల్ కోసం హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్లను ఇండియాకు రప్పిస్తున్నారు. అందుకే ఇంత ఖర్చు అవుతుంది. ముందే చెప్పుకున్నట్టు విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ సినిమా. మొన్నటివరకు మీడియం రేంజ్ బడ్జెట్ లో తీసిన ఈ నిర్మాతలు, విజయ్ దేవరకొండ సినిమాతో మళ్లీ భారీ చిత్రాల వైపు మళ్లారు.