స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు

సౌత్ ఇండస్ట్రీలో హారర్ కామెడీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముని సిరీస్ అని చెప్పుకోవచ్చు. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో ఇప్పటికే నాలుగు భాగాలు బయటకు వచ్చాయి. ఈ మధ్యనే విడుదలైన ‘కాంచన 3’ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ‘కాంచన’ సినిమా ను ‘లక్ష్మీబాంబ్’ అనే టైటిల్ తో హిందీ రీమేక్ చేయబోతున్నారు.

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ తాజాగా తాను ఆ సినిమా నుంచి తప్పుకుంటున్న వార్తను సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు లారెన్స్. “మనకు గౌరవం లేని ఇంట మనం అడుగు పెట్ట కూడదు” అని అందుకనే తాను సినిమా నుంచి తప్పుకుందామని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు రాఘవ లారెన్స్.సినిమా నుంచి బయటకు రావడానికి తనకు బోలెడు కారణాలు ఉన్నాయని అందులో ఒకటి తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారని, ఎవరో మూడవ వ్యక్తి చెప్పే వరకు ఆ విషయం తనకు తెలియలేదని ఆవేదనను వ్యక్తం చేశాడు రాఘవ.

తాను తలుచుకుంటే ఎప్పుడైనా సినిమాను ఆపేయచ్చు కానీ అది సబబు కాదని స్క్రిప్ట్ ను మాత్రం సంతోషంగా ఇచ్చి తాను మాత్రం సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. త్వరలో అక్షయ్ కుమార్ ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇచ్చేస్తానని చెప్పిన లారెన్స్ సినిమా హిట్ అవ్వాలని కూడా కోరుకున్నాడు.