సూర్య రేంజ్ ఇంతేనా

తెలుగు ఇండస్ట్రీలో సైతం మంచి స్టార్ డమ్ ఉన్న తమిళ హీరోలలో సూర్య కూడా ఒకడు. తను హీరోగా నటించిన ‘గజిని’, ‘సెవెంత్ సెన్స్’, ‘వీడొక్కడే’, ’24’ సినిమాలు తెలుగులో కూడా హిట్ అయ్యాయి. అయితే గత కొంత కాలంగా తెలుగులో సూర్య కి మార్కెట్ తగ్గింది. తాజాగా ‘సింగం 3’ మరియు ‘గ్యాంగ్’ సినిమాలు కూడా అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేశాయి. ఆ ప్రభావం ఇప్పుడు సూర్య తదుపరి సినిమా పైన కూడా పడబోతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘ఎన్జికే’ అనే సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

తమిళంలో ఈ సినిమాకు బీభత్సమైన క్రేజ్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా అంచనాలు లేవు.కనీసం చిత్రానికి సంబంధించిన దర్శక నిర్మాతలు కూడా సినిమా ప్రమోషన్లపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ ను కె.కె.రాధామోహన్ ఎనిమిది కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అది చాలా తక్కువ అని చెప్పాలి కానీ ప్రస్తుతం తెలుగులో సూర్య మార్కెట్ ను బట్టి చూస్తే పర్వాలేదనిపిస్తుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మే 31న విడుదల కాబోతోంది. మరి కనీసం ఈ సినిమాతో అయినా సూర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.