ఆ సర్వేలు బూటకమట….

అనేక మీడియా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి ఓటమి తప్పదని తేల్చి చెప్పాయి. ఒకటి, రెండు సంస్థలు మాత్రమే టీడీపీ వైపు మొగ్గు చూపాయి.

అయితే, చంద్రబాబు మాత్రం ఈ సర్వేలను పట్టించుకోవద్దని పార్టీ శ్రేణులకూ, నేతలకు సలహా ఇస్తున్నారట. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని, ప్రజల్లో ఉన్న అండర్ కరెంటుతో తమ విజయం ఖాయమని అంటున్నారట. ఏది ఏమైనా తాము తిరిగి సర్కారును ఏర్పాటు చేసి తీరుతామనే భరోసా ఇస్తున్నారట.

పార్టీ నేతలలో కౌంటింగ్ దాకా ఆత్మ విశ్వాసం సడలకుండా ఉండేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓటమి ఖాయమని తెలిస్తే పార్టీ శ్రేణులు ఎక్కడ చెదిరి పోతాయోనని చంద్రబాబు భయపడుతున్నారని అంటున్నారు.

టీడీపీ అధినేతకు ఓటమి ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. గతంలోనూ ఆయన తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో వీరిద్దరి మధ్య చర్చ రసవత్తరంగా నడిచేది. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఊహ చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

ఇప్పటికీ ఆయనకు మహిళా ఓట్ల మీద ఆశలు చావలేదని, అలాగే తెలంగాణ సెటిలర్ల ఓట్ల మీద భారీ ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. వీరంతా కట్టగట్టుకుని టీడీపీకి ఓట్లు వేశారని, దీనిని ఎవ్వరూ గుర్తించలేకపోతున్నారనీ, తనను కలిసిన ప్రతి నాయకుడికీ చెబుతున్నారట. దీంతో వారంతా తలలు పట్టకుంటున్నారని అంటున్నారు.

ఒక వైపు పార్టీ అభ్యర్థులకే తమ విజయం మీద భరోసా లేకపోవడం, మరోవైపు ఎగ్గిట్ పోల్స్ అంచనాలన్నీ తమకు విరుద్ధంగా రావడం టీడీపీ శ్రేణులనూ, నేతలనూ నిరుత్సాహపరిచాయని అంటున్నారు. ఈ క్రమంలో గెలుపు తథ్యమని చంద్రబాబు మాట్లాడడం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారట.

అయితే, జరగనున్న పరిణామాలకు చంద్రబాబు మానసికంగా ఎప్పుడో సిద్ధమైపోయారని, పార్టీ నేతలలో ఆత్మ విశ్వాసం చెదరకుండా ఉండేందుకే గెలుపు మంత్రం పఠిస్తున్నారని సీనియర్ నాయకుల అభిప్రాయం. తాము కూడా ఓటమి అనంతర పర్యవసానాలకు తయారుగా ఉండాల్సిందేననే నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారు.