ఎట్టకేలకు విజయం సాధించిన రకుల్

తెలుగులో ఆమె సక్సెస్ కు దూరమైంది. కోలీవుడ్ లో కూడా రీసెంట్ గా ఆమెకు విజయాల్లేవు. అలా సక్సెస్ కోసం పరితపిస్తున్న రకుల్ కు సరైన విజయం దక్కింది. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. అవును.. రకుల్ నటించిన బాలీవుడ్ సినిమా అక్కడ హిట్ అయింది. ఆమెకు తొలి బాలీవుడ్ సక్సెస్ ఇది.

అజయ్ దేవగన్ తో కలిసి దేదే ప్యార్ దే అనే సినిమా చేసింది రకుల్. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, చాలామంది బాగాలేదన్నారు. కానీ రెండో రోజు నుంచి టాక్ మారింది. సినిమా బాగుందంటున్నారు. వీకెండ్ గడిచేసరికి కంప్లీట్ పాజిటివ్ టాక్ తో సినిమా హిట్ రేంజ్ కు వెళ్లిపోయింది. అలా బాలీవుడ్ లో తొలి విజయం అందుకుంది రకుల్.

అందరు హీరోయిన్లలానే రకుల్ కు బాలీవుడ్ అంటే మోజు. అక్కడ ఓ వెలుగు వెలగాలని రకుల్ కు కూడా అశగా ఉండేది. అందుకే ఇప్పటికి రెండుసార్లు హిందీలో ట్రై చేసింది. కానీ రెండు సార్లూ ఫెయిల్ అయింది. మూడో ప్రయత్నంగా చేసిన దేదే ప్యార్ దే సినిమా మాత్రం సక్సెస్ అవ్వడంతో రకుల్ ఆనందానికి అవధుల్లేవ్. ప్రస్తుతం ఈ సక్సెస్ ను యూనిట్ తో కలిసి ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.