Telugu Global
NEWS

టీఆర్ఎస్ కిం కర్తవ్యం?

గులాబీ దళపతి కేసీఆర్ ఈసారి కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. అందుకే దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నాయకులను కలిసి వచ్చారు. తీరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి నీరుగారిపోయారని తెలుస్తోంది. ఢిల్లీలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలలో ఎవ్వరికీ పూర్తి మెజారిటీ రాదని, అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయని భావించారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే అసలు ఫలితాలు కూడా వస్తే ఆ అవకాశం లేకుండా పోయినట్లేనని […]

టీఆర్ఎస్ కిం కర్తవ్యం?
X

గులాబీ దళపతి కేసీఆర్ ఈసారి కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. అందుకే దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నాయకులను కలిసి వచ్చారు. తీరా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి నీరుగారిపోయారని తెలుస్తోంది.

ఢిల్లీలో జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలలో ఎవ్వరికీ పూర్తి మెజారిటీ రాదని, అప్పుడు ప్రాంతీయ పార్టీలే కీలకమవుతాయని భావించారు. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే అసలు ఫలితాలు కూడా వస్తే ఆ అవకాశం లేకుండా పోయినట్లేనని అంటున్నారు. ఇది టీఆర్ఎస్ కు నిరాశ కలిగించే అంశమేనని ఆ పార్టీ నేతలు అంటున్నారట.

తాము వేసుకున్న అంచనాలన్నీ తలకిందులు అవుతాయేమోనని వాపోతున్నారట. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంచనా ఫలితాలు చూసి ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని చెబుతున్నారు. రాష్ట్రంలో 16 సీట్లలో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు వెలువడినా, కేసీఆర్ మాత్రం అంత సంతోషంగా లేరని అంటున్నారు.

2014లోనూ కేంద్రంలో చేరాలని భావించారని, నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన తన కుమార్తె కవితకు మంత్రి పదవి కోసం యత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. కానీ, అప్పుడు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో అది సాధ్యం కాలేదని అంటున్నారు. కనీసం ఈసారి అయినా ఆ కోరిక తీరుతుందని అనుకున్నారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను జాతీయ రాజకీయాలలో బిజీ కావాలని కేసీఆర్ భావించారు. వీలైతే ఉప ప్రధాని దాకా వెళ్లాలని ఆకాంక్షించారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి ఢీలా పడిపోయారని అంటున్నారు.

ఒకవేళ తగిన సంఖ్యా బలంతోనే బీజేపీ తిరిగా అధికారం చేపడితే కేసీఆర్ కు ఇబ్బందులు తప్పవేమోననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ కేంద్రంతో సఖ్యతగానే మెలిగింది. మిత్రపక్షంగానే వ్యవహరించింది. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక తన స్టాండ్ మార్చుకుని బీజేపీ మీద విమర్శలు గుప్పించింది. అవసరమైతే కాంగ్రెస్ కు అయినా సహకరిస్తామని కేసీఆర్ సంకేతాలు కూడా ఇచ్చారు.

వీటన్నింటికీ తోడు ఎన్నికల సమయంలో బీజేపీకి చెందిన 8 కోట్ల రూపాయల ఎన్నికల నిధులను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయంలో కూడా బీజేపీ నాయకత్వం కేసీఆర్ మీద గుర్రుగా ఉందని చెబుతున్నారు.

ఈ పరిణామాల కారణంగా, బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పట్ల మోడీ అంత సఖ్యతగా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? లేక కేసీఆర్ కోరుకున్నట్టు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు దారులు పడతాయా తేలాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే?

First Published:  20 May 2019 10:12 PM GMT
Next Story