Telugu Global
NEWS

ప్రజలు చేసిన పాపం... ప్రకృతి ఇస్తున్న శాపం...!

“అంతా నువ్వే చేసావ్… అవును నువ్వే చేసావ్.. నీ వల్లే ఇదంతా” ఇది ఓ సినిమాలో డైలాగ్. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలకి ప్రకృతి ప్రజలను ప్రశ్నిస్తున్న డైలాగ్ కూడా ఇదే. గడచిన 15 రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అక్కడా… ఇక్కడా అని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకటే పరిస్థితి. ఎండలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. […]

ప్రజలు చేసిన పాపం... ప్రకృతి ఇస్తున్న శాపం...!
X

“అంతా నువ్వే చేసావ్… అవును నువ్వే చేసావ్.. నీ వల్లే ఇదంతా” ఇది ఓ సినిమాలో డైలాగ్. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలకి ప్రకృతి ప్రజలను ప్రశ్నిస్తున్న డైలాగ్ కూడా ఇదే.

గడచిన 15 రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అక్కడా… ఇక్కడా అని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒకటే పరిస్థితి. ఎండలకు ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ వేలాది మంది మృత్యువాత పడ్డారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండుతున్నాయి. మరో 15 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

గడచిన పది సంవత్సరాలుగా వాతావరణంలో పెను మార్పులు వస్తున్నాయి. సరైన సమాయానికి వర్షాలు కురియక… ఎన్నడూ లేనంత చలి వెంటాడుతూ… వేసవి కాలంలో ఎండలు దారుణంగా మండిపోతున్నాయి. వాతావరణంలో ఈ పరిస్థితులకు కారణం ప్రజలు చేసిన తప్పేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

పర్యావరణ సమతుల్యాన్ని పాటించకపోవడం, ఆర్థిక లాభాల కోసం అడవులను నరికి వేయడం, పట్టణాలు, నగరాలలో పచ్చటి పొలాలను సైతం రియల్టీ వ్యాపారంగా మార్చేయడం ఈ వాతావరణ పరిస్థితులకు కారణమని చెబుతున్నారు. నగరాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులను కబ్జా చేసి వాటిపై అపార్ట్ మెంట్లను నిర్మించడంతో మనిషికి ఖచ్చిత అవసరాలైన నీరు, గాలి వంటివి కూడా లేకుండా పోతున్నాయి అని చెబుతున్నారు.

దేశంలోకి ఐటీ పరిశ్రమలు వచ్చిన తర్వాత నగరాలలోని శివారు ప్రాంతాలలో ఉన్న పంట పొలాలను ఆకాశ హర్మ్యాలుగా మార్చేస్తున్నారు. మనిషులు మితి మీరిన అత్యాశతో పర్యావరణాన్ని నాశనం చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని అంటున్నారు.

ఎండలు మండిపోవడం, వర్షాలు కురవక అల్లాడి పోవడం, వాతావరణంలో అకాల మార్పులు రావడం వంటివి మనిషి చేసిన పాపాలుగా చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో ప్రకృతి కోపానికి… అది ఇచ్చే శాపానికి మానవులు మరింత బలవుతారని హెచ్చరిస్తున్నారు.

First Published:  20 May 2019 11:25 PM GMT
Next Story