ఎప్పుడో తన పరువు పోగొట్టుకున్నాడు…. ఇప్పుడు రాష్ట్రం పరువు తీస్తున్నాడు

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు వైసీపీ నేత సి. రామచంద్రయ్య. ఐదేళ్ళుగా చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కొన్ని గంటల్లో ఫలితాలు రానున్న నేపథ్యంలో…. వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్నాయని తెలిసి దానిని బాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.

పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు సి. రామచంద్రయ్య.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గుచేటని, చంద్రబాబు రాబోయే ఓటమిని ఈవీఎంలపై నెట్టే యత్నం చేస్తున్నారన్నారు.

విపక్షాల సమావేశానికి చంద్రబాబును పూర్తిగా పక్కన పెట్టారని…. జాతీయ నేతలు పిలవకున్నా చంద్రబాబు వెళుతున్నారని, చంద్రబాబును జాతీయ నేతలు ఒక జోకర్‌ లాగా భావిస్తున్నారని చెప్పారు. అన్నీ తన చేతిమీదే జరుగుతున్నట్టు మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాడని, చర్చల కన్నా ఫొటో సెషన్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని….. తాను ఏది చెబితే అది జరగాలనే అత్యాశ చంద్రబాబుదన్నారు. చేసిన తప్పులను పక్కవాళ్ళపైకి నెట్టడంలో చంద్రబాబు దిట్ట అన్నారు.

చంద్రబాబు తన హుందాతనాన్ని కోల్పోవడమే కాక… పక్కరాష్ట్రాలకు వెళ్ళి ఏపీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దేశంలో ఎక్కడా విలువలేదన్నారు సి. రామచంద్రయ్య. ఈ ఐదేళ్ళలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు.