చిట్ చాట్ లో బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టాడు

ఎన్టీఆర్ తనకుతానుగా ఓ బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటపెట్టాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు ఈ హీరో. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ మూవీ చేస్తున్న తారక్, ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించిన ఎన్టీఆర్, మాటల మధ్య ఈ విషయాన్ని బయటపెట్టాడు.

నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కథా చర్చలతో పాటు నిర్మాత కూడా ఫిక్స్ అయ్యాడు. కొరటాల స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్ అయిన ఓ వ్యక్తి ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నాడు. ఆర్-ఆర్-ఆర్ తర్వాత దాదాపు ఇదే సినిమా సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తారక్ మాత్రం త్రివిక్రమ్ పేరు ప్రకటించింది అందరికీ షాకిచ్చాడు.

ఏదేమైనా అప్పుడే ఈ ప్రాజెక్టుపై ఓ అంచనాకు రాలేం. ఎందుకంటే వచ్చే ఏడాది జులై 30న ఆర్-ఆర్-ఆర్ రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా ఏడాదికి పైగా టైమ్ ఉందన్నమాట. ఈ ఏడాదిలో ఎన్ని సమీకరణాలు మారతాయో చూడాలి.

అయితే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో సినిమా మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ మేరకు హారిక-హాసిని నిర్మాతలు ఎన్టీఆర్ కు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. అదెప్పుడనేది మాత్రం ఆర్-ఆర్-ఆర్ రిలీజ్ తర్వాత మాత్రమే క్లారిటీ వస్తుంది.